ప్రాణహితకు పోటెత్తిన వరద…నీటమునిగిన పంటలు

146
pranahitha

మంచిర్యాల జిల్లా ప్రాణహిత నదికి వరద పోటెత్తడంతో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ప్రాణహితకు సహజ సిద్ధంగా వచ్చే వరద దిగువన ఉన్న గోదావరి నది లో వరద పరవళ్ళు తొక్కుతోంది. దీంతో అటు ప్రాణహిత ,ఇటు గోదావరి నది బ్యాక్ వాటర్ పెరిగి పత్తి పంటలు నీట మునిగాయి.

దీంతో రైతులు లబోదిబోమం టున్నారు. నదీతీరం వెంట ఉన్న వేమనపల్లి, కోటపల్లి మండలాలతోపాటు కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లోని వేల ఎకరాల్లో పత్తి పంటలు నీటిపాలయ్యాయి.ప్రాణహిత వరద పోటెత్తడంతో లోతట్టు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మత్తడివాగు వరకు వరద నీరు పోటెత్తుతుండటంతో వంతెనపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కళ్లెంపల్లి బొందచేను ఒర్రె, చింత ఒర్రె వంతెనలపై నుంచి వరద వెళ్తోంది.

దీంతో పలు మండలాలకు రాకపోకలు స్తంభించాయి. ముల్కలపేట, రాచర్ల గ్రామాల మధ్య ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డు వంతెనలపై నుంచి వరద పోటెత్తి ప్రవహిస్తోంది. దీంతో కోటపల్లి, వేమనపల్లి మండలాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. దీంతో పాటు పడవల్లో జనం ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం కొనసాగిస్తున్నారు.