ఇక సెలవు…మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు సైనిక లాంఛనాల మధ్య ఢిల్లీలో ముగిశాయి. కోవిడ్ నిబంధనల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరోనా కారణంగా ప్రత్యేక అంబులెన్స్‌లో ప్రణబ్ పార్దీవ దేహాన్ని లోధీ స్మశాన వాటికకు తరలించారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది ప్రణబ్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అంతకముందు 10 రాజాజీ మార్గ్‌లోని ప్రణబ్ నివాసంలో ఆయన పార్థీవ దేహానికి రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, త్రివిధ దళాల అధిపతి రావత్, రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్ తదితరులు ప్రణబ్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.
అనారోగ్య సమస్యలతో ఆగస్టు 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్ప్రతిలో ప్రణబ్ చేరిన విషయం విదితమే. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఆయనకు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు సర్జరీ చేశారు. ఆ తర్వాత ప్రణబ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 31న సాయంత్రం ప్రణబ్ తుదిశ్వాస విడిచారు.