ఈ నెల 12న జరగనున్న కర్ణాటక ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రాదని విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ జోస్యం చెప్పారు. గతంలో కర్ణాటకలో బీజేపీ పాలనలో ఉన్నప్పుడు ఐదేళ్లలో ముగ్గురు సీఎంలు మారారని ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీపై దేశ వ్యాప్తంగా అసహనం మొదలైందని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారని… ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీ పతనం కర్ణాటకతో మొదలవుతుందని… 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవుతుందని తెలిపారు. 2019లో మోదీ ప్రధానిగా ఉండబోరని చెప్పారు. బెంగళూరులో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మేరకు స్పందించారు.
కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కొన్ని రోజులు బీజేపీ హవా ఉందని… అప్పుడున్న హవా ఇప్పుడు లేదని… ప్రచారపర్వంలో దూసుకుపోయే మోదీ, కర్ణాటకలో కేవలం ఐదు రోజులకే పరిమితమవుతున్నారని… బీజేపీ పరిస్థితి ఏమిటన్న దానికి ఇదే ఉదహరణ అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని అరాచకాలు జరగుతున్నాయో అందరికీ తెలుసని అన్నారు. చెన్నైలో తమిళులకు భయపడిన మోదీ… రోడ్డుపై కాకుండా హెలికాప్టర్ లో ప్రయాణం చేశారని ఎద్దేవా చేశారు. బీజేపీని ఓడించాలని కర్ణాటక ఓటర్లను తాను కోరుతున్నానని చెప్పారు.
ఇంకా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ…‘ కర్ణాటకలో భాజపా అధికారంలోకి రావడమనేది కల్ల. విభజించి పాలించే అధికారాన్ని ఎవరూ కోరుకోరు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ అందిరికీ చోటుంటుంది. స్వేచ్ఛ ఉంటుంది. ఏ మతానికో, కులానికో మన దేశం పరిమితం కాదు. దక్షిణ భారత దేశంలో భాజపా ఇక అధికారంలోకి రాదు. వారి సిద్ధాంతాలు ఇక్కడ పనికి రావు. మనదేశంలో ఉండే రాజకీయ పార్టీలన్నింటికీ సొంత నిర్ణయాలు, సిద్ధాంతాలు ఉంటాయి. కానీ ఒక్క భాజపా మాత్రం వేరొకరి సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటుంది.’అని ప్రకాశ్ రాజ్ తెలిపారు.