రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించడంతో సాయంత్రం ప్రదీప్ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ రోజు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రెండో సీఎస్‌గా ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులలో రాజీవ్‌శర్మ తర్వాత సీనియర్ ప్రదీప్ చంద్ర. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది అధికారులు స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీనియరైన ప్రదీప్ చంద్రను కొత్తసీఎస్ గా నియమించేందుకు సీఎం మొగ్గు చూపారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎస్ గా పని చేసిన కాకి మాధవరావు అల్లుడైన సీఎస్ గా ప్రదీప్ చంద్ర కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాదాలకు దూరంగా ఉంటారని, ఎవరికీ హాని చేయరని పేరుంది. కేంద్ర మంత్రివర్గ సభ్యులతో కూడా ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి.
ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ప్రదీప్ చంద్ర.. కోల్‌కతా ఐఐఎంలో ఎంబీఏ చేశారు. కాలిఫోర్నియా వర్సిటీలో పబ్లిక్ అడ్మినిసే్ట్రషనలో పీహెచడీ పూర్తి చేశారు. ఐఏఎస్‌కు ఎంపికైన తర్వాత, గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్‌గా పని చేసిన ఆయన… సాంకేతిక విద్య డైరెక్టర్‌గా, ఏపీఎండీసీ ఈడీగా, ఎస్సీ కార్పొరేషన ఎండీగా కూడా చేశారు. ఇండస్ట్రీస్ కామర్స్‌తోపాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసి.. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ తొలి బడ్జెట్ రూపకల్పనతోపాటు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తుది నోటిఫికేషనలో కీలక భూమిక పోషించారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా మాజీ ఎంపీ జి.వివేక్ నియమితులయ్యారు. అంతరాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా ఆయన్ని నియమిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇవాళ పదవీ విరమణ చేయనున్న సీఎస్ రాజీవ్ శర్మను సైతం కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుగా నియమించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే కేబినెట్ అమోద ముద్ర కూడా వేసింది.