కేంద్రమాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. భార్యా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రేపు ఉదయం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
1940, జనవరి 20న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో విజయనరగ సామ్రాజ్య క్షత్రియుల వంశస్థుల కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తిపేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. చదువు పూర్తికాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పనిచేశారు.1966లో ‘చిలకా గోరింకా’ సినిమాతో సినీరంగ ప్రవేశంచేశారు. చిరంజీవి – కృష్ణంరాజు ఇద్దరిది ఒకే ఊరు.
183కుపైగా చిత్రాల్లో నటించారు. భక్త కన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపుతీసుకొచ్చాయి. చివరిసారిగా రాధేశ్యామ్ సినిమాలో నటించారు. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. 1998 ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి విజయం సాధించి వాజ్‌పేయి హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ప్రజారాజ్యం నుండి రాజమండ్రి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు.