తగ్గుతున్న మోడీ గ్రాఫ్..రాబోయేది సంకీర్ణ శకం:కేటీఆర్

224
KT Rama Rao
- Advertisement -

బీజేపీతో తెలంగాణ అభివృద్ధి జరగదని…రాబోయేది సంకీర్ణ శకం అని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత ఎడవెల్లి విజేందర్ రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ..నరేంద్రమోడీ పాపులారిటీ రోజు రోజుకు తగ్గుతుందన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట మసకబారుతుందన్నారు.

పెద్దనోట్ల రద్దుతో మన పైసల కోసం మనమే బ్యాంకుల ముందు క్యూ లైన్లో నిలబడాల్సిన పరిస్ధితి వచ్చిందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పుకొదగ్గ పథకం ఒక్కటి చేపట్టలేదన్నారు. దేశ ప్రజలకు ఎన్డీఏ చేసింది ఏమి లేదన్నారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చలేదన్నారు. కొత్త రాష్ట్రానికి
ఉతమిస్తూ అభివృద్ధిలో తెలంగాణకు చేయూత నివ్వాల్సి న కేంద్రం మినమేషాలు లెక్కబెట్టిందన్నారు.

ఐఏఎస్ అధికారుల విభజనలో మోడీ ఆలస్యం చేశారని చెప్పారు. ఐటీఐఆర్‌ విషయాన్ని ఐదేళ్లుగా పట్టించుకోలేదన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపడంలో విఫలమయ్యారన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలోనూ మొండిచేయి చూపించారని విమర్శించారు.
ప్రత్యేక హైకోర్టు విభజన,ట్యాక్స్ రాయితీ అంశాలను అటకెక్కించారని చెప్పారు.

ఇవాళ అమిత్ షా, స్మృతీ ఇరానీ వచ్చినా రేపు మోడీ వచ్చినా తెలంగాణకు చేసిందేమిటో చెప్పే పరిస్ధితి లేదన్నారు. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి విమర్శలు చేయాలనే ఉద్దేశంతోనే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని చెప్పారు.పార్లమెంట్ సాక్షిగా సీఎం కేసీఆర్ పనితీరును ప్రధానమంత్రి నరేంద్రమోడీ పొగిడిన విషయాన్ని గుర్తుచేశారు. పలువురు కేంద్రమంత్రులు సైతం కేసీఆర్ పనితీరును మెచ్చుకున్నారని చెప్పారు. కానీ అమిత్‌ షాకు మాత్రం తెలంగాణ అభివృద్ది కనిపించడం లేదన్నారు. రాహుల్ ఎక్కడ అడుగుపెడితే అక్కడా బూడిదే అన్నారు. తెలంగాణ వచ్చాక జరిగిన ప్రతి ఎన్నికల్లో టీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారని చెప్పారు.

- Advertisement -