గ్రేటర్ ఎన్నికల్లో వీరి కోసం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం..

22
Postal ballot

ఈ సారి జీహెచ్ఎంసీ ఎన్నికలలో వికలాంగులకు, 80 ఏండ్లు పైబడిన వారికి, కోవిడ్ 19 పాజిటివ్ పేషెంట్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించబడింది. ఈ కెటగిరీల వారు ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా లేదా నేరుగా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసి వినియోగించుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. పోలింగ్ కేంద్రంలో వికలాంగులు, వయస్సు పైబడిన వారి సౌకర్యార్థం ర్యాంపులు, వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

వీల్ చైర్లు తోయడానికి వాలంటీర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వికలాంగులు, వయస్సు పైబడిన వారు, పసిపిల్లల తల్లులు క్యూలైన్‌తో సంబంధం లేకుండా నేరుగా ఓటు వేయవచ్చు. అలాగే కోవిడ్ 19 పేషెంట్లు మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లోవ్స్ ధరించి, కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ సాయంత్రం 5.00 గంటల నుండి 6.00 గంటల లోపు ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.