తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి తమ మద్దతు తెలుపుతూ ఊరురా ప్రతిజ్ఞ చేస్తున్నారు. అంతేకాదు పలువురు సినీ సెలెబ్రిటీలు సైతం గులాబీ దళానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కే ఓటేస్తానని దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళి తన మద్దతు తెలిపారు.
హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆంధ్రావాసులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను నమ్మొద్దు.. బాబు లాంటి మోసగాడు దేశంలో మరొకరు లేరు. ఆయన మాటలను నమ్మి టీడీపీకి ఓటేస్తే మరో యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుందని పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ శనివారం పోసాని నివాసానికి వెళ్లారు. ప్రచారంలో భాగంగా పోసానిని కలసి, ఆయన మద్దతు కోరారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, తాను టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తానని చెప్పారు. తక్కువ వ్యవధిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత కేసీఆర్ ది అని కితాబిచ్చారు. దేశంలో ఉన్న గొప్ప ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకరని ఆయన అన్నారు.