రష్యా వేదికగా జరుగుతున్న సాకర్ ప్రపంచకప్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మరోసారి అద్భుతం చేశాడు. తన జీనియస్ గేమ్‌తో పోర్చుగల్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. స్పెయిన్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన రొనాల్డో మొరాకోతో మ్యాచ్‌లో మ్యాజిక్ చేశాడు. అద్భుత గోల్ సాధించి పోర్చుగల్‌ను నాకౌట్ రేసులో నిలబెట్టాడు. మరోవైపు ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించిన తొలిజట్టుగా మొరాకో నిలిచింది.
బలమైన డిఫెన్స్ కలిగిన జట్టుగా పేరున్న మొరాకో జట్టు రక్షణ వలయం రొనాల్డో ముందు నిలవలేదు. ఆట ప్రారంభం అయిన నాలుగో నిమిషంలోనే మొరాకో డిఫెన్స్‌ను ఛేదించి అద్భుత గోల్ కొట్టాడు రొనాల్డో. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు నమోదైన ఫాస్టెస్ట్ గోల్‌గా ఇది నిలిచింది.
అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ సాధించిన ఐరోపా ఆటగాడిగా రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. మొరాకోపై సాధించిన గోల్ కెరీర్‌లో అతడికి 85వది. ఈ టోర్నీలో రొనాల్డో ఇప్పటివరకు నాలుగు గోల్స్ కొట్టాడు. 1998 తర్వాత తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించిన మొరాకో.. వరుసగా రెండో ఓటమితో నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది. పోర్చుగల్ తన తర్వాతి మ్యాచ్ ఈ నెల 25న ఇరాన్‌తో తలపడుతుంది.