వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం “మార్టిన్ లూథర్ కింగ్”. మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు, వి.కె. నరేష్, శరణ్య ప్రదీప్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో దర్శకుడిగా విశేషంగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అంతేకాదు ఈ సినిమాలో ఆయన ముఖ్యపాత్ర పోషించడం విశేషం. వినోద ప్రధానంగా రూపొందిన ఈ రాజకీయ వ్యంగ్య చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శనివారం నాడు విలేకర్లతో ముచ్చటించిన దర్శకురాలు పూజ కొల్లూరు చిత్ర విశేషాలను పంచుకున్నారు.
మీ కుటుంబ నేపథ్యం ఏంటి? సినీ పరిశ్రమలోకి ఎలా వచ్చారు?
నేను విజయవాడలో సత్యనారాయణపురంలో పెరిగిన ఒక మధ్యతరగతి జర్నలిస్ట్ కూతురుని. పదో తరగతి వరకు కేంద్రీయ విద్యాలయంలో చదివాను. నాకు ఇంటర్ లో అందరిలాగా ఎంపీసీ, బైపీసీ తీసుకోవాలని లేదు. సైన్స్ అంటే చాలా ఇష్టం. అలాగే ఐఏఎస్ అవ్వాలనే కల కూడా ఉండేది. ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఆఫ్ మహేంద్ర గురించి తెలిసింది. రెండు మూడు వేల మంది అప్లై చేస్తే, నలుగురైదుగురుకి అక్కడ సీట్ వస్తుంది. అలా వచ్చిన వారిలో నేనూ ఒకదానిని. నాకు అక్కడ స్కాలర్ షిప్ కూడా వచ్చింది. అక్కడ నేను ఫిజిక్స్ చదివాను, ఎకనామిక్స్ చదివాను. ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. స్పానిష్ చదివాను. వీటితోపాటు ఆర్ట్స్ లో కూడా ఒకటి ఎంపిక చేసుకోవాలి. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి ఉన్నదానిగా ఫిల్మ్ స్టడీస్ తీసుకున్నాను. అక్కడ మాకు ఒకసారి ఓ స్పానిష్ ఫిల్మ్ చూపించారు. ఆ సినిమా స్పానిష్ సివిల్ వార్ గురించి ఉంటుంది. ఒక సినిమాతో ఎంతలా ప్రభావితం చేయొచ్చు అనేది ఆ సినిమా ద్వారా తెలిసింది. సైంటిస్ట్, ఐఏఎస్ అయ్యి చేసేదాని కంటే.. సినిమాతో ఎక్కువ ప్రభావితం చేయొచ్చు అనిపించింది. అప్పటి నుంచి ఇక పూర్తిగా సినిమానే అని నిర్ణయించుకున్నాను. సినిమాకి సంభందించి డిగ్రీ కోసం ఇక్కడ సరైన కాలేజ్ లేదు. అమెరికాలో మంచి కాలేజ్ లో స్కాలర్ షిప్ వచ్చింది. అలా అమెరికా వెళ్ళి నాలుగేళ్లు ఫిల్మ్ మేకింగ్ చదివాను. స్కాలర్ షిప్ తో కూడా చదువుకోవచ్చు అనేది తెలియజేయడం కోసం నేను ఇదంతా చెబుతున్నాను.
సినిమా గురించి ఇంత నాలెడ్జ్ ఉన్న మీరు రీమేక్ ఎందుకు ఎంచుకున్నారు?
ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన కథ. ఇలాంటివి వంద
రీమేక్ లైనా చేయొచ్చు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయి. అలాగే నేను కూడా ఎన్నో కథలు రాసుకున్నాను. కానీ ఎవరికైనా కథ చెప్తే, ఇది ఐదేళ్ళ తర్వాత చేయాల్సిన సినిమా అనేవాళ్ళు. అలా నేను ఎదురు చూస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు అనిపించింది. కొందరేమో రొమాంటిక్ కామెడీలు, ఫ్యామిలీ డ్రామాలు చేయొచ్చు కదా అనేవాళ్ళు. అవి తీయడంలో తప్పులేదు. కానీ విజయనిర్మల గారి తరహాలో విభిన్న చిత్రాలతో నా ప్రత్యేకతను చాటుకోవాలి అనుకున్నాను. పైగా ఈ కథ నాకు బాగా నచ్చింది. నేను ఎలాంటి కథ చెప్పాలి అనుకున్నానో అలాంటి కథ ఇది.
వెంకటేష్ మహా గారి ప్రాజెక్ట్ లోకి మీరు వెళ్ళారా? లేక మీ ప్రాజెక్ట్ లోకి మహా గారు వచ్చారా?
వెంకటేష్ మహా గారి ప్రాజెక్ట్ లోకి నేను వెళ్ళాను. మహా గారు మర్మాణువు అనే సినిమా చేస్తున్నారు కదా. మిత్రుల ద్వారా నా గురించి తెలుసుకొని ఆ సినిమా కోసం నన్ను పిలిచారు. ఆ కథ విని నేను ఎంతో ప్రభావితం అయ్యాను. నేను ఎవరి దగ్గర పని చేయాలి అనుకోవడం లేదు, కానీ మీ దగ్గర పని చేయడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆ కథ అంత బాగుంది అని చెప్పాను. ఆయన ఎంతో కష్టపడతారు. కేరాఫ్ కంచరపాలెం లాంటి గొప్ప సినిమాతో తానేంటో నిరూపించుకున్న ఆయన అంత కష్టపడుతుంటే.. నేనెంత కష్టపడాలి అని అనుకున్నాను. నేను మహా గారి దగ్గర పనిచేస్తున్న సమయంలో వైనాట్ స్టూడియోస్ వారు ఈ సినిమా కోసం ఆయనను సంప్రదించారు. మొదట రీమేక్ పై అంతగా ఆసక్తి చూపని మహా గారు.. సినిమా చూసిన తర్వాత ఇతర కమిట్ మెంట్స్ వల్ల డైరెక్ట్ చేయలేను కానీ, నిర్మాణ భాగస్వామిగా ఉంటా అన్నారు. మా టీంతో పాటు నేను కూడా ఆ సినిమా చూశాను. నా అంతట నేనుగా ఈ సినిమా చేస్తానని అడిగాను. ఈ కథలో ఎంతో లోతైన భావం ఉంది. అందుకే ఈ సినిమా చేయాలని అనిపించింది. మహా గారు వైనాట్ స్టూడియోస్ వారితో మాట్లాడి మీకు ఫిమేల్ డైరెక్టర్ ఓకేనా అని అడిగారు. సుధ కొంగర, పుష్కర్ గాయత్రి వంటి వారితో సినిమాలు చేశాము. మాకు అలాంటి భేదాలు లేవని చెప్పారు.
స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మీకు రాయాలి అనిపించలేదా?
మహా గారికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ మీద మంచి పట్టుంది. ఆయన ప్రేక్షకుల నుంచి వచ్చిన దర్శకుడు. అందుకే ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యేలా రాయగలరు.
Also Read:కాంగ్రెస్‌కు అదే సెంటిమెంట్ రిపీట్!
నటీనటుల ఎంపిక ఎలా జరిగింది?
సంపూర్ణేష్ బాబు గారిని తీసుకోవాలి అనేది మహా గారి ఎంపిక. ఈ పాత్రకు ఆయన వెయ్యి శాతం సరిపోయారు. ఆయన వస్తే ఒక మామూలు మనిషే తెరమీద కనిపిస్తాడు. ఈ పాత్ర ఆయన కోసమే పుట్టినట్టు ఉంటుంది. ఆయన గత చిత్రాలతో పోలిస్తే ఇందులో విభిన్నంగా కనిపిస్తారు. ఆయన సంపూర్ణేష్ బాబు కాకముందు నరసింహా చారి గా ఎలా ఉన్నారో అలాగే కనిపిస్తారు.
మహిళా దర్శకురాలిగా పరిశ్రమలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? నూతన మహిళా దర్శకులు వచ్చే వాతావరణం ఉందా?
ఏ పరిశ్రమలోనైనా సమస్యలు ఉంటాయి. మన పట్టుదలే మనల్ని ముందుకు నడిపిస్తుంది. మహిళలకు కొంచెం అవకాశాలు తక్కువగానే ఉంటాయి. కొందరు ఇవన్నీ ఎందుకు మీకు, రొమాంటిక్ కామెడీ సినిమాలు చేసుకోవచ్చు కదా అని అంటుంటారు. ఇలా కొన్ని సమస్యలు ఉంటాయి. మన పట్టుదలతో వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి ఉంది. తెలుగుకి తగ్గట్టుగా సినిమాలో ఎలాంటి మార్పులు చేశారు?
సినిమాలో ఎన్నో మార్పులు చేశాము. తమిళ రాజకీయాలను, అక్కడి సంస్కృతిని చూపించిన సినిమా మండేలా. తెలుగుకి తగ్గట్టుగా చాలా మార్పులు జరిగాయి. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో చూపించే ప్రయత్నం చేశాం. ఎవరినో నొప్పించడానికో, లేదా ఎవరికో ప్రయోజనం చేకూరేలాగానో ఈ సినిమా చేయలేదు. ప్రజల కోసం తీశాం. మహా గారు ఒక మాట అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల గురించి సినిమాలు వస్తాయి. ప్రజల కోసం ఎలాంటి సినిమాలు రావు. కానీ ఎన్నికల్లో పాల్గొనే అతిపెద్ద నాయకుడు ప్రజలు. అందుకే ప్రజల కోసం, వారి ప్రాముఖ్యతను తెలపడం కోసం తీసిన సినిమా ఇది.
రీమేక్ అంటే పోలికలు వస్తాయి కదా.. సంపూర్ణేష్ విషయంలో అలాంటి పోలికలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
నేను ఆ సినిమా చూస్తూ ఈ సినిమా తీయలేదు. ఆ సినిమా స్ఫూర్తితో మహా గారు స్క్రిప్ట్ రాశారు. ఒక దర్శకురాలిగా ఆ స్క్రిప్ట్ పరంగానే నేను సినిమా తీశాను. మాతృకతో పోలిస్తే చాలా కొత్తగా ఉంటుంది. షూట్ కి వెళ్ళడానికి ముందే ప్రతి చిన్న విషయంలోనూ ఎంతో హోం వర్క్ చేశాం.
ఇందులో వెంకటేష్ మహా గారు ఒక పాత్రలో నటించడానికి కారణం?
అది అనుకోకుండా జరిగింది. ముందుగా ఒక నటుడిని అనుకున్నాం. కానీ ఒక పెద్ద సినిమా కారణంగా ఆయన అందుబాటులో లేరు. చిత్రీకరణకు ఇంకో పదిరోజులు ఉంది అనగా, మహా గారు చేస్తే బాగుంటుంది అనుకున్నాం. పైగా ఆయనలో అద్భుతమైన నటుడు ఉన్నాడు.
ఈ సినిమాకి బలం ఏంటి?
ఐదేళ్ళ చిన్న పిల్లల నుంచి 80 ఏళ్ల పెద్దవారి వరకు వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు మనస్ఫూర్తిగా చూసి నవ్వుకునే చిత్రమిది. ఇందులో వినోదంతో పాటు బలమైన సందేశం ఉంటుంది. ఓటు విలువని తెలియచేసేలా ఉంటుంది. ఓటరే కింగ్ అనేది ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాం.
మార్టిన్ లూథర్ కింగ్ అనే టైటిల్ ఎవరి నిర్ణయం?
మహా గారు, నేను కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. ఓటరునే కింగ్ గా చూపించాలి అనుకున్నాం. మార్టిన్ లూథర్ కింగ్ ఓటు కోసం ఎంతో పోరాటం చేశారు. అందుకే ఆయన పేరు ఈ సినిమాకి సరైన టైటిల్ అనిపించింది.
ఓటు విలువ గురించి ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. ఇందులో కొత్తగా ఏం చూపించబోతున్నారు?
ఇది ప్రజల కోణంలో ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో ఓటు మాకు వేయండి నాయకుల కోణంలో చూపించారు. కానీ ఇందులో అసలు మీకు ఓటు ఎందుకు వేయాలి అంటూ ప్రజల కోణంలో ఉంటుంది.
ఎడిటర్ గా కూడా మీరే చేయడానికి కారణం?
ముందుగా ఒకరు కొంచెం ఎడిట్ చేశారు. కానీ ఆ వర్క్ తో నేను సంతృప్తి చెందలేదు. ఫిల్మ్ మేకింగ్ లో భాగంగా నేను ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను. అందుకే నేనే ఎడిట్ చేశాను. దర్శకులకి ఎడిటింగ్ వచ్చి ఉండాలి అని నేను అనను. కానీ అన్ని విభాగాల మీద అవగాహన ఉండటం అవసరం.
సంగీతం గురించి?
స్మరణ సాయి అద్భుతమైన సంగీత అందించారు. ఐదు పాటలు చక్కగా కుదిరాయి. అయితే పాటలన్నీ కథలో భాగంగానే ఉంటాయి.
చిన్న వయసులోనే మిమ్మల్ని నమ్మి ఇంత బాధ్యత ఎలా అప్పగించారు?
నా ప్రతిభను చూసి ఇచ్చారు. కాలేజ్ సమయంలో నేను తీసిన చిత్రం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు పొందాయి. అలాగే అమెజాన్ ఫారెస్ట్ లో నేను తీసిన డాక్యుమెంటరీ కూడా ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు అందుకుంది. నేను ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకి దర్శకురాలిగా పరిచయం అవుతున్నాను కానీ, నాకు దర్శకత్వం కొత్తకాదు.