ప్రస్తుతం అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్లో బయోపిక్‌ల హవా నడుస్తోంది. అంతేకాదు ఈ బయోపిక్ సినిమాల్లో నటిస్తున్న నటినటులలు కూడా ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ప్రత్యేకంగా క్రీడాకారుల జీవిత ఆధారంగా క్రీడా నేపథ్యంలో వచ్చే బయోపిక్‌ల వెల్లువ అంతకంతకు పెరుగుతోంది. ఇదివరకు వచ్చిన మేరీకోమ్ – సచిన్ – ధోని బయోపిక్‌లే అందుకు ఉదాహారణగా చెప్పుకోవచ్చు.
ఇటీవలే బ్యాడ్మింటన్ క్వీన్ సైనా నెహ్వాల్ బయోపిక్ ప్రారంభమైంది. సైనా పాత్రలో శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పలువురు క్రీడాకారిణుల బయోపిక్‌లు తీసేందుకు ఫిలింమేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.గత కొంతకాలంగా హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా – క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌లు తెరకెక్కించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ తరహా బయోపిక్‌లలో నటించేందుకు ముంబై బ్యూటీ పూజా హెగ్డే ఆసక్తి చూపించడం విశేషం.
తాజాగా ఓ కార్యక్రమంలో పూజా హెగ్డే మాట్లాడుతూ- బయోపిక్‌లలో నటించడానికి తాను కూడా సిద్ధమేనని.. ‘సానియా మీర్జా, మిథాలి రాజ్ వంటి వాళ్ల జీవితాలు ఇంటరెస్టింగ్‌గా వుంటాయి కాబట్టి, వీరి బయోపిక్‌లు బాగుంటాయి. ఇలాంటి వాటిలో నటించే అవకాశం వస్తే కనుక అస్సలు వదులుకోను’ అని చెప్పింది పూజా. ప్రస్తుతం ఈ ముంబై బ్యూటీ వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.