రివ్యూ:పొన్నియన్‌ సెల్వన్‌-1

311
- Advertisement -

దక్షిణ భారత చారిత్రక నేపథ్య నవల ఆధారితంగా తెరకెక్కిన సినిమా పొన్నియన్‌ సెల్వన్‌ అదే పేరుతో రెండు భాగాలుగా  తీయనున్నారు. 1990లలో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు తీసిన ఘనత కలిగిన ప్రముఖ తమిళ డైరెక్టర్‌ మణిరత్నం పీఎస్‌-1 సినిమాను తీశారు. ఇందులో ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో కనిపించడం, భారీ నిర్మాణ విలువలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

కథేంటంటే
చోళ సామ్రాజ్య చక్రవర్తి సుందర చోళుడి (ప్రకాష్‌ రాజ్‌)కి ఇద్దరు కొడుకులు ఆదిత్య కరికాలన్‌ (విక్రమ్‌), అరణ్‌మోళి వర్మ /పొన్నియన్‌ సెల్వన్‌ (జయం రవి), ఒక కుమార్తె కుందవై (త్రిష) ఉంటారు. ఆదిత్య కరికాలన్‌ యుద్ధ వీరుడిగా చోళ సైన్యాన్ని విజయాలతో ముందుకు నడిపిస్తుంటాడు. పాండ్యులను, రాష్ట్రకూట రాజులను యుద్ధంలో ఓడిస్తాడు. యుద్ధంలో గాయపడిన వీరపాండ్య రాజును ఒక ఇంట్లోకి తీసుకెళ్లి సపర్యలు చేసి కాపాడే ప్రయత్నం చేస్తుంది నందినీ(ఐశ్వర్యరాయ్‌). ఈ నందినీ ఆదిత్య గతంలో ప్రేమించిన అమ్మాయి. శత్రువుకు తన ప్రేయసి సపర్యలు చేయడం ఆదిత్య కరికాలన్‌ సహించలేకపోతాడు. ఆ ఇంట్లోకి వచ్చి వీర పాండ్యరాజును చంపవద్దని నందినీ వేడుకుంటున్నా..అతన్ని వధిస్తాడు. దీంతో ఆదిత్య కరికాలన్‌పై పగ పెంచుకున్న నందినీ అతని సామంతుడు, తంజావురు రాజైన పళువెట్టరాయ (శరత్‌ కుమార్‌)ను పెళ్లి చేసుకుంటుంది.

సుందర చోళుడి సోదరుడి కుమారుడైన మధురాంతకుడు (రెహమాన్‌)ని రాజును చేయాలని పళువెట్టరాయ సారథ్యంలో సామంతులు కుట్ర చేస్తుంటారు. మరోవైపు పాండ్య రాజ్యంలో మిగిలిన సైనికులు చోళ యువ రాజులైన ఆదిత్య కరికాలన్‌, అరణ్‌మోళి వర్మలను చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. వేగుల ద్వారా సామంతుల కుట్ర విషయం తెలుసుకున్న ఆదిత్య కరికాలన్‌ తన మిత్రుడు వల్లవరాయ వందియదేవుడు (కార్తి)ని ద్వారా రహస్య లేఖలను తంజావూరులో ఉన్న తండ్రి సుందర చోళుడికి, పళయారైలో ఉన్న కుందవై, అరణ్‌మోళి వర్మలకి పంపిస్తాడు. రాజ కుటుంబంపై కుట్ర మొదలైందని తెలిసిన కుందవై తంజావూరు వచ్చి సామంత రాజుల్లో ఐక్యత లేకుండా చేసే ఉపాయాలు పన్నుతుంటుంది. అరణ్‌మోళి వర్మను కూడా పళయారై నుంచి తంజావూరు రప్పించేందుకు కుట్రదారులు పథకాలు వేస్తారు. ఒకవైపు మధురాంతకుడిని బలపరిచే సామంత రాజుల కుట్ర, మరోవైపు అంతపురంలోనే ఉంటూ పగ సాధించాలని నందినీ ప్రయత్నాలు, ఇంకోవైపు ప్రతీకారం కోసం చూస్తున్న పాండ్యరాజు సైనికులు…వీళ్లందరి పన్నాగాల నుంచి రాజ కుటుంబం ఎలా బయటపడింది అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే…
చాలా విస్తృతమైన చారిత్రక నేపథ్య కథ ఇది. కథలోని వీరత్వం, కుట్ర కోణం, భావోద్వేగాలు దర్శకుడిని సినిమా రూపొందించేందుకు పురికొల్పి ఉంటాయి. చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో క్లుప్తంగా కథను వివరిస్తూ సినిమా ప్రారంభమవుతుంది. ఆదిత్య కరికాలన్‌ పరాక్రమం చూపించే యుద్ధ సన్నివేశాలు, అతనికి సహాయపడే వందియదేవుడి వీరత్వంతో సినిమా వేగంగా టేకాఫ్‌ అవుతుంది. సముద్రంలో జరిగే కొన్ని యుద్ధ సన్నివేశాలు బాగుంటాయి.  వందియదేవుడిని(కార్తి) ఆదిత్య కరికాలన్‌ తన పని మీద వివిధ ప్రాంతాలకు పంపినప్పటి నుంచి కథ నెమ్మదిస్తుంది. అనుమతి లేని కోటల్లోకి ఉపాయంగా అతను వెళ్లడం, రహస్య లేఖలను చేరవేసే క్రమంలోనూ సన్నివేశాలు అంతగా ఆకర్షించలేకపోతాయి. సినిమా మొత్తం భేళగ కనిపిస్తోంది. వినోదం కోసం అళ్వార్‌ కడియన్‌ నంబి (జయరాం)ను తోడుగా పెట్టుకున్నా, అది అక్కడక్కడ మాత్రమే వర్కవుట్‌ అయ్యింది.

ఇది తొలి భాగం సినిమా కాబట్టి కథను చాలా వరకు పాత్రలను పరిచయం చేసేందుకే దర్శకుడు ఉపయోగించుకున్నాడు. ఇందులో కొన్ని క్యారెక్టర్స్‌ ఉన్నాయి, వాటి మధ్య సంఘర్షణ ఇది, అవి ఎదుర్కొనే సమస్యలు ఇవీ అని చెప్పే వరకే తొలి భాగం సినిమా పూర్తవుతుంది. మంచి ఎమోషన్‌, హీరోయిజం ఉన్న కథను అంతే ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు దర్శకుడు మణిరత్నం. ప్రేక్షకులకు కావాల్సిన రీతిలో సన్నివేశాలు, పాటలు ఉండవు. ఉన్న రెండు మూడు పాటలకు పౌరాణిక నేపథ్యాలు ఎంచుకున్నారు. విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, త్రిష, కార్తీ.. వీళ్లంతా ఆయా పాత్రలకు వన్నె తీసుకొచ్చారు.  బోలెడన్ని పాత్రలు వాటి పేర్లు కుట్రలు తెరపై చూస్తున్నప్పుడు కాస్త గందరగోళంగా అనిపిస్తాయి. నిజానికి ఒక్కొక్క పాత్రలో ఒక్కో సినిమా చేసేంత బలమైన పాత్రలు ఇవి. ప్రకాశ్‌రాజ్‌, శరత్‌కుమార్‌, పార్తిబన్‌, విక్రమ్‌ప్రభు తదితరుల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. కానీ ఉన్నంతలో పరిధి మేరకు నటించారు.

నిర్మాణ విలువలు
తోట తరణి ప్రొడక్షన్‌ డిజైనింగ్‌లో భారీతనం కనిపించింది. రవి వర్మన్‌ సినిమాటోగ్రఫీ ఉన్నతంగా ఉంది. సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ను ఈ తొలి భాగం సినిమా ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. పాటల్లో గానీ నేపథ్య సంగీతంలో గానీ ఏఆర్‌ రెహమాన్‌ ప్రభావం కనిపించలేదు. ఈ కథకు ఇంతే కావాలని అనుకున్నారేమో తెలియదు.

పొన్నియన్‌ సెల్వన్‌ 1 ఇండియన్‌ స్క్రీన్‌పై ఒక భారీ ప్రయత్నమే అయినా కథలోని ఉద్వేగాన్ని ప్రేక్షకులకు అందించలేకపోయిందనే చెప్పాలి. మణిరత్నం దర్శకత్వంలో సినిమాను సాగదీత కనిపించిన  మొత్తం నవల ఆధారంగా తీశారు. పుస్తకాన్ని తెరపైకి ఆవిష్కరించే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది తప్ప… పెద్దగా సాంకేతికతను ఉపయోగించుకోలేకపోయారు. ఇందులో కొంతవరకు కొత్తగా మాటలను పొందుపర్చలేకపోవడం కొసమెరుపు. సినిమాకు తగ్గటుగా  ఎక్కడకూడా స్టార్‌ కాస్టింగ్‌, మేకింగ్‌ వ్యాల్యూస్‌ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అయ్యాయి. ఇక్కడ మాత్రం మద్రాస్‌ టాకీస్‌, లైకా నిర్మాణ సంస్థలు వెనక్కి తగ్గలేదు.
రేటింగ్‌ 3/5

- Advertisement -