తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం

8
- Advertisement -

తిరుమలలో రాజకీయ పోస్టర్ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ముందు రాజకీయ పోస్టర్‌తో రీల్స్ చేయడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఏఐఏడీఎంకే (ADMK) కార్యకర్తలు ఈ ఘటనకు కారణమయ్యారు. ఆలయం ముందు వారు రూపొందించిన రీల్‌లో పార్టీకి సంబంధించిన పోస్టర్ స్పష్టంగా కనిపించగా, అందులో దివంగత నాయకురాలు జయలలితతో పాటు పార్టీ నేత పళనిస్వామి చిత్రాలు ఉన్నాయి.

తిరుమల వంటి అత్యంత పవిత్రమైన ప్రాంతంలో రాజకీయ ప్రచారానికి సంబంధించి ఏ చర్యలకైనా కఠిన నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ, కొంతమంది కార్యకర్తలు అత్యుత్సాహంతో ఆలయ పరిసరాల్లో రాజకీయ సంకేతాలు ప్రదర్శించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు ఈ ఘటనను తప్పుబడుతూ, ఆలయ పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనలో టిటిడి భద్రతా సిబ్బంది తగిన విధంగా స్పందించలేదన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అక్కడే ఉన్నా భద్రతా అధికారులు ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Also Read:దావోస్‌కు రేవంత్..కోర్టు పర్మిషన్

ఆలయం ముందు తీసిన ఈ రాజకీయ రీల్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వివాదం మరింత పెరిగింది. ఈ ఘటనపై టిటిడి యాజమాన్యం స్పందించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో రాజకీయాలకు తావులేకుండా చూడాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది.

- Advertisement -