ఏటీఎం నగదు చోరి.. సులబ్‌ కాంప్లెక్స్‌లో డబ్బులపెట్టె…!

285
axis bank atm

హైదరాబాద్ వనస్థలిపురం యాక్సిస్ బ్యాంకు ఏటీఏం ముందు సినీ ఫక్కీలో వందల రూపాయలు ఎరవేసి అరకోటికి పైగా కొట్టేశారు కేటుగాళ్లు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన రాజధానిలో తీవ్ర కలకలం రేపింది. రూ.58 లక్షలను అపహరించుకుపోవడంతో పోలీసులకు సవాల్‌ విసిరినట్లయింది. ఈ నేపథ్యంలో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు.

వాహనం నుంచి ఎత్తుకెళ్లిన డబ్బు పెట్టెను మలక్‌పేట సమీపంలోని సులభ్‌ కాంప్లెక్స్‌లో పడేసి డబ్బు తీసుకొని చెక్కేశారు దుండగులు. దీంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. ఆరేడుగురు వ్యక్తులు ఆ ప్రాంతాల్లో తిరిగినట్లు గుర్తించిన పోలీసులు ఈ కేసులో ప్రమేయం ఉందని భావిస్తున్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

తమిళనాడులోని తిరుచ్చికి చెందిన రాంజీనగర్‌ ముఠా సభ్యులుగా పోలీసులకు ఆధారాలు లభించినట్టు సమాచారం. రాంజీనగర్‌కు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. రెండు మూడు రోజుల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి రెక్కీ నిర్వహించిన తర్వాతే దొంగతనానికి పాల్పడ్డారని అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దొంగతనానికి పాల్పడిన వారిలో ఇద్దరు నేరస్థులు దీపు, రామ్‌ మొతిరన్‌ల ఫొటోలు, సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలతో సరిపోయాయి. మరో ఇద్దరు నిందితులు బీస్మార్‌, పేరు తెలియని వ్యక్తి వివరాల కోసం తమిళనాడు పోలీస్‌ అధికారులను సంప్రదిస్తున్నారు. మొత్తంగా త్వరలోనే యాక్సిస్ బ్యాంకు ఏటీఏం ముందు చోరికి పాల్పడిన దుండగులను పట్టుకుని డబ్బు రీకవర్ చేస్తామని చెబుతున్నారు.