వివేకా మరణం వెనుక కుట్ర..పోలీసులకు ఫిర్యాదు

237
ys viveka heart attack
- Advertisement -

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి ఇవాళ ఉదయం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో వైసీపీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి చెందగా పులివెందులలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అయితే వివేకా హఠాన్మరణంపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. వివేకా తల,ఒంటిపై గాయాలున్నట్లు ఆయన పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మరోవైపు వివేకానంద రెడ్డి హఠాన్మరణాన్ని అనుమానాస్పద మృతిగా భావిస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుండెపోటుతో మరణించారని సమాచారం అందిందని, కానీ పరిసరాలు చూస్తే వివేకానంద రెడ్డి మృతిపై అనుమానం కలుగుతుందన్నారు. ఇది సహజ మరణమా? లేక ఎవరైనా ఉన్నారా? అనేది లోతైన దర్యాప్తు ద్వారా తేల్చాలని డిమాండ్ చేశారు.

1950 ఆగస్టు 8న జన్మించిన వివేకానందరెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు (1999, 2004)ఎంపీగా ఎన్నికయ్యారు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు (1989, 1994) సేవలందించారు. 2009లో సెప్టెంబర్‌లో ఉమ్మడి ఏపీలో మండలి సభ్యుడిగానూ పనిచేశారు. 2010లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు.

సౌమ్యుడిగా ఉన్న పేరున్న వివేకా లయిన్స్ క్లబ్‌ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లింగాల కాల్వకు డిజైన్ రూపకల్పన చేసింది కూడా ఆయనే.

- Advertisement -