హీరా గ్రూప్ సీఈవోపై కేసు నమోదు

4
- Advertisement -

హీరా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నౌహీరా షేక్ పై మరోసారి మోసపూరిత కార్యకలాపాల ఆరోపణలు ఎదురయ్యాయి. అధిక లాభాలు వస్తాయని నమ్మించి భారీగా పెట్టుబడులు తీసుకుని తరువాత కమిషన్లు ఇవ్వకుండా మోసం చేశారన్న ఆరోపణలతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

హైదరాబాద్ సన్ సిటీలో నివసించే మహ్మద్ సల్మా ఫాతిమా 2016లో హీరా గ్రూపులో రూ.40 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు పోలీసులకు తెలిపింది. అంతేకాక, ఆమె కుటుంబ సభ్యులు కూడా సంస్థ హామీల నమ్మకంతో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే 2018కి వచ్చేసరికి సంస్థ కమిషన్లు, లాభాల పంపిణీ పూర్తిగా నిలిపివేసిందని బాధితురాలు తెలిపింది.

తమ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపణలతో బాధితురాలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బంజారాహిల్స్ పోలీసులు నౌహీరా షేక్‌పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సంస్థ లావాదేవీలు, పెట్టుబడుల వివరాలు, నిధుల వినియోగం వంటి అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

గతంలో కూడా నౌహీరా షేక్‌పై ED (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్), CCS (సెంట్రల్ క్రైమ్ స్టేషన్) లలో పలు కేసులు నమోదయ్యాయి. పెట్టుబడిదారుల నుంచి భారీ మొత్తాలు సేకరించి అక్రమంగా నిధులను మళ్లించినట్లు అప్పటి విచారణల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. తాజా కేసుతో హీరా గ్రూప్ వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

Also Read:TTD:వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

- Advertisement -