భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మరోసారి శుభవార్తను ప్రకటించింది. ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) మూడు రోజుల పాటు కొనసాగిన సమావేశాల అనంతరం కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తున్నట్లు కేంద్ర బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీంతో రెపో రేటు ప్రస్తుతం 5.25 శాతానికి చేరింది.
ఈ నిర్ణయం వల్ల బ్యాంకులపై అప్పు భారాలు తగ్గే అవకాశం ఉండగా, రుణాలపై వడ్డీ రేట్లు కూడా తగ్గనున్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా హోమ్ లోన్స్, ఆటో లోన్స్, వ్యక్తిగత రుణాలు వంటి విభాగాలకు ఇది ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉందని, వృద్ధిని మరింత ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు తీసుకోవడం జరిగినట్లు RBI తెలిపింది.
ఈ ఏడాదిలో వడ్డీ రేట్ల కోత ఇది నాలుగోసారి కావడం విశేషం. ఇప్పటికే గత సమావేశాలలో వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వచ్చిన RBI, ఆర్థిక వ్యవస్థలో వృద్ధి ఉత్సాహాన్ని కొనసాగించేందుకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నట్లుగా, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు స్థిరంగా లేకపోయినా, భారత్‌లో వృద్ధి ధోరణి బలంగా కొనసాగుతున్నదని MPC సమీక్షలో బయటపడిందన్నారు. రానున్న త్రైమాసికాల్లో కూడా ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని, అవసరమైతే మళ్లీ తగిన చర్యలు తీసుకుంటామని RBI స్పష్టం చేసింది.
Also Read:లండన్‌కు బంగ్లామాజీ ప్రధాని ఖలీదా

