పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, వారికి జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా చూడాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ పోడు సమస్య పరిష్కారానికి చారిత్మాత్మక నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోడు భూముల సమస్య పరిష్కారం, అటవీ భూముల రక్షణ అంశాలపై శనివారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, అఖిల పక్ష నేతలు, జిల్లా అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అటవీ విస్తీర్ణం, పోడు భూముల సమస్యలను అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…పోడు సమస్యకు ఓ ముగింపు పలకాలనే కృతనిశ్చయంతో సీఎం కేసీఆర్ ఉన్నారని, దీనికి అఖిల పక్ష నేతలు కూడా సహకరించాలని కోరారు. పోడు సమస్య పరిష్కారంతో పాటు భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని అడవులు అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి గతంలో ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఎంత మందికి, ఎన్ని ఎకరాలకు పట్టాలు అందించాలనే విషయమై సమగ్ర సమాచారం సేకరించాలని, దీనిపై గ్రామ, డివిజనల్, జిల్లా స్థాయి కమిటీలు కసరత్తు చేయాలని ఆదేశించారు. పోడు భూములు, అడవుల సంరక్షణ విషయాలపై ప్రభుత్వ నిబంధనలు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ యాక్ట్‌లోని అంశాలను తప్పకుండా పాటించాలన్నారు.
నవంబర్ 8 నుండి డిసెంబర్ 8 వరకు పోడు వ్యవసాయం చేస్తున్నగిరిజనులు, తదితరుల నుండి క్లెయిమ్స్ స్వీకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో నవంబర్ 8 లోగా వివిధ స్థాయిల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్వోఎఫ్ఆర్ చట్టం ప్రకారం గ్రామ కమిటీల నియామకం చేపట్టాలన్నారు. రాష్ట్రంలో పోడు వ్యవసాయం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక్కటన్నారు.ఈ ప్రాంతంలో అటవీ భూమి ఎక్కువగా ఉన్న క్రమంలో వాటిని కాపాడటంతోపాటు సమస్యను ప్రజలకు వివరించి, సామరస్యపూర్వకంగా పరిష్కారం చూపాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ఎవరెవరు పోడు వ్యవసాయం చేస్తున్నారనే వివరాలు పకడ్బందీగా సేకరించాలని తెలిపారు. ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని స్పష్టం చేశారు.
సమగ్ర అధ్యయనం తర్వాతే సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు అర్హులకు భూములపై హక్కులు కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశానంతరం పోడు సమస్య పరిష్కారం తర్వాత, అడవుల పరిరక్షణ, పునరుజ్జీవ చర్యల్లో భాగంగా ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిదులు, అఖిల పక్ష నేతలు, అధికారులు ప్రతిజ్ఞ చేశారు. చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు బాధ్యతయుత పౌరులుగాతమ వంతు కృషి చేస్తామన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, జడ్పీ చైర్ పర్సన్ కె, విజయలక్ష్మి రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, అఖిల పక్ష నేతలు, జిల్లా అటవీ, గిరిజన, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.