POCSO..కానిస్టేబుల్‌కు 31 ఏళ్ల జైలు శిక్ష

6
- Advertisement -

సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన రక్షకుడే భక్షకుడిగా మారిన ఘటనలో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు కోర్టు 31 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

2020లో హైదరాబాద్ పరిధిలోని బోయినపల్లి ప్రాంతానికి చెందిన వరదరాజ్ సుధేష్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు. తాడ్ బండ్ ప్రాంతంలో నివాసముంటున్న ఒక మైనర్ బాలికపై అతను లైంగిక దాడికి పాల్పడ్డాడు. రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టడంతో అప్పట్లో ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసుపై గత ఆరేళ్లుగా న్యాయస్థానంలో సుదీర్ఘ విచారణ సాగింది. విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం.. నిందితుడు వరదరాజ్ సుధేష్‌పై మోపబడిన నేరాలు నిజమేనని నిర్ధారించింది.

పోక్సో ప్రత్యేక న్యాయస్థానం ఈ క్రింది విధంగా శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.నిందితుడికి 31 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలైన బాలికకు రూ. 1 లక్ష పరిహారంగా చెల్లించాలని నిందితుడిని కోర్టు ఆదేశించింది. సమాజంలో చట్టాన్ని గౌరవించాల్సిన స్థానంలో ఉండి, చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి ఈ శిక్ష తగిన గుణపాఠమని, ఇది బాధితురాలికి న్యాయం చేకూర్చేలా ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:తిలక్ వర్మపై అర్ష్‌దీప్ కామెంట్‌?

- Advertisement -