అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం…ఎన్నిక లాంఛనమే

174
pocharam

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడింది. స్పీకర్‌గా మాజీ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అసెంబ్లీ చాంబర్‌లో స్పీకర్‌గా నామినేషన్ వేశారు . ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. పోచారం అభ్యర్థిత్వానికి అన్నిపార్టీలు మద్దతు పలికాయి.ఆరు సెట్లలో ఆయన నామినేషన్ దాఖలు చేయగా తొలిసెట్ పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

స్పీకర్‌గా పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్‌), ఇంద్రకరణ్‌రెడ్డి (నిర్మల్‌) పేర్లను పరిశీలించిన చివరికి పోచారం అభ్యర్థిత్వం వైపే మొగ్గుచూపారు కేసీఆర్. సీనియర్ నేత కావడం,మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండటంతో పోచారం సభను సమర్థంగా నిర్వహించగలరని సీఎం భావించారు.

ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం వ్యవసాయమంత్రిగా సమర్ధవంతంగా బాధ్యతలు చేపట్టారు. వయస్సు, ఆరోగ్యపరమైన సమస్యలను ఆయన సీఎం దృష్టికి తెచ్చినా.. వాటిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎం భరోసా ఇచ్చినట్లు తెలిసింది.

1976లో రాజకీయరంగ ప్రవేశం చేసిన పోచారం 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత 1999,2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో ఎమ్మెల్యే,టీడీపీ పదవికి రాజీనామా చేసిన పోచారం టీఆర్ఎస్‌లో చేరి భారీ మెజార్టీతో గెలిచారు.2011 నుండి 14 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. పంచాయతీ రాజ్‌,భూగర్భ గనుల శాఖమంత్రిగా పనిచేశారు. 2014లో వ్యవయసాయ శాఖమంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో బాన్సువాడ నుండి భారీ మెజార్టీతో గెలుపొందారు పోచారం.