రష్యాలో న్యుమోనిక్ ప్లేగ్ అనుమానిత కేసు వెలుగులోకి రావడంతో అమెరికా అప్రమత్తమైంది. సైబీరియాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ఓ మహిళ మృతిచెందిన ఘటనపై అమెరికా నిఘా పెట్టినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారి వెల్లడించారు. అయితే ఇది ప్లేగ్ కేసేనని ఇప్పటివరకు రష్యా అధికారికంగా ధృవీకరించలేదు.
ఇర్కుట్స్క్‌లోని యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే 28 ఏళ్ల ల్యాబొరేటరీ ఉద్యోగి అనారోగ్యంతో మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆమెకు తొలుత తీవ్రమైన న్యుమోనియా లక్షణాలు కనిపించాయని, అనంతరం పరిస్థితి విషమించడంతో మరణించినట్లు సమాచారం. రష్యా ఆరోగ్య పర్యవేక్షణ సంస్థ మాత్రం ఆమెకు “తెలియని కారణంతో వచ్చిన న్యుమోనియా” ఉన్నట్లు పేర్కొంది.
ఈ ఘటనపై అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పందించింది. ఇర్కుట్స్క్ ప్రాంతంలో అనుమానిత న్యుమోనిక్ ప్లేగ్ కారణంగా మరణం సంభవించినట్లు వచ్చిన నివేదికలను పరిశీలిస్తున్నామని తెలిపింది. అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు వెల్లడించింది. రష్యా అధికారులు ఖచ్చితమైన సమాచారాన్ని త్వరగా, పారదర్శకంగా వెల్లడించాలని అమెరికా కోరింది.
మరోవైపు, బాధితురాలితో సంబంధం ఉన్నవారిని గుర్తించి వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 200 మందిని పరిశీలనలో ఉంచినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు విస్తృత స్థాయిలో ప్లేగ్ వ్యాప్తి జరిగినట్లు అధికారికంగా ప్రకటించలేదు.
Also Read:వైవా హర్ష ..లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
న్యుమోనిక్ ప్లేగ్ అనేది Yersinia pestis అనే బ్యాక్టీరియా వల్ల కలిగే తీవ్రమైన వ్యాధి. ఊపిరితిత్తులను ప్రభావితం చేసే ఈ వ్యాధికి సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అయితే ప్రారంభ దశలో సరైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే కోలుకునే అవకాశం ఉంటుంది.

