లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 116 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. గుజరాత్‌లోని 26 లోక్‌సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాణిప్ పోలింగ్ కేంద్రంలో క్యూలైనులో నిలబడి ఆయన ఓటు వేశారు. అంతకుముందు గాంధీనగర్‌లోని తన మాతృమూర్తి నివాసానికి చేరుకున్న మోదీ..ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయన వెంట భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా ఉన్నారు. ఓటు వేసిన అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ.. సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలాని ప్రజలకుపిలుపునిచ్చారు.