ప్రముఖ వీడియో గేమ్ సిరీస్ ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో’ (GTA) కొత్త వెర్షన్ GTA VI విడుదల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. GTA V విడుదలైన 2013 నుంచి ఇప్పటివరకు భారత్‌లో చోటుచేసుకున్న మార్పులను వివరిస్తూ దేశ అభివృద్ధిని హైలైట్ చేశారు. ఈ రెండు గేమ్‌ల విడుదల మధ్య ఉన్న 13 ఏళ్ల వ్యవధిని భారత ప్రగతితో పోల్చారు. ఈ సందర్భంగా భారత్ ఇప్పుడు సరికొత్త గేమ్ ఆడుతోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
భారత్‌లో వచ్చిన మార్పులు ఇవే’ అనే శీర్షికతో 2013 నుంచి దేశం సాధించిన అభివృద్ధిని వివరించారు. ఆర్థిక వ్యవస్థ, పేదరిక నిర్మూలన, పారిశుద్ధ్యం, సౌర విద్యుత్, అంతరిక్ష రంగం, విద్యుదీకరణ, రక్షణ ఎగుమతులు, అంతర్గత భద్రత వంటి అంశాల్లో వచ్చిన మార్పులను ప్రస్తావించారు. కాగా 2013లో GTA V విడుదలైన సమయంలో దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రస్తుతం మోదీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ 13 ఏళ్ల కాలంలో భారత్ సాధించిన ప్రగతిని ఆయన తన పోస్టు ద్వారా వివరించారు.
భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. గత 13 ఏళ్లలో దేశ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని వివరించారు. పేదరిక స్థాయిలు తగ్గడం కూడా దేశం సాధించిన ముఖ్యమైన విజయాల్లో ఒకటిగా ప్రస్తావించారు.దేశంలో పారిశుద్ధ్య రంగంలో సాధించిన పురోగతిని కూడా ప్రధాని ప్రస్తావించారు. స్వచ్ఛత మిషన్ పూర్తయినట్లు స్లైడ్‌లలో పేర్కొన్నారు. అలాగే సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిన విషయాన్ని హైలైట్ చేశారు.
Also Read:ఎల్‌నినో పరిస్థితులు..గ్లోబల్ సమ్మిట్ అవసరమా?
అంతరిక్ష రంగంలో స్టార్టప్‌లకు అవకాశాలు కల్పించడం మరో కీలక మార్పుగా వివరించారు. గతంలో ప్రభుత్వ రంగానికే ఎక్కువగా పరిమితమైన అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ సంస్థలు, స్టార్టప్‌లకు కూడా అవకాశాలు పెరిగాయని పేర్కొన్నారు.మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యుదీకరణలో సాధించిన పురోగతిని మోదీ ప్రస్తావించారు. భారత రక్షణ రంగంలో ఎగుమతులు పెరగడాన్ని కూడా ముఖ్యమైన విజయంగా పేర్కొన్నారు.

