జనవరి 16 న ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దేశవ్యాప్తంగా కోవిడ్ -19 టీకా డ్రైవ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్రమోడీ.దేశంలోని అన్ని ప్రాంతాలను భాగస్వామ్యం చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమంగా పేర్కొంది కేంద్రం.
అన్ని రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 3,006 సెషన్ సైట్లు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అనుసంధానించబడతాయని వెల్లడించింది.ప్రారంభ రోజున ప్రతి సెషన్ సైట్లో సుమారు 100 మంది లబ్ధిదారులకు టీకాలు వేయనున్నారు. ఈ టీకా కార్యక్రమం టీకాలు వేయవలసిన వారి ప్రాధాన్యత ఆధారపడి ఉంటుందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.
మొదటి దశలో ఐసిడిఎస్ కార్మికులతో సహా ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలోని ఆరోగ్య సంరక్షణ కార్మికులకు వ్యాక్సిన్ వేయనున్నారు.వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఆన్లైన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ కో-విన్ ను ఉపయోగించనుంది ప్రభుత్వం. టీకా నిల్వలు, నిల్వ ఉష్ణోగ్రత, వ్యాక్సిన్ కోసం లబ్ధిదారుల ట్రాకింగ్, సమాచారాన్ని సులభతరం చేయనుంది కో-విన్ ఆన్లైన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్.
టీకా సెషన్లను నిర్వహిస్తున్నప్పుడు అన్ని స్థాయిలలోని ప్రోగ్రామ్ నిర్వాహకులకు సహాయం చేయనుంది కో-విన్.కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్, కో-విన్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన సమస్యల పరిష్కరానికి ప్రత్యేకంగా 24×7 కాల్ సెంటర్ – 1075 ఏర్పాటు చేయనున్నారు.పౌర విమానయాన మంత్రిత్వ శాఖ క్రియాశీల సహకారంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు తగినన్ని డోసుల కోవిషిల్డ్, కోవాక్సిన్ లను పంపిణీ జరిగినట్లు వెల్లడించింది.వ్యాక్సిన్ లను ఇప్పటికే రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వాలు జిల్లాలకు పంపిణీ చేశాయని తెలిపింది కేంద్ర ప్రభుత్వం.