ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత షీలాదీక్షిత్ (81) మృతి చెందారు. శనివారం ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఇక్కడి ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. ఆసుపత్రి ఛైర్మన్ అశోక్ సేథ్ నేతృత్వంలోని బృందం ఆమెకు అత్యాధునిక వైద్యసేవలు అందించింది. పరిస్థితి మెరుగుపడినప్పటికీ రెండోసారి గుండెపోటు రావడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సాయంత్రం 3.55 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచారు. షీలా దీక్షిత్ భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు.
నిజాముద్దీన్‌లోని షీలాదీక్షిత్ నివాసంలో ప్రధానమంత్రి మోడీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు షీలాదీక్షిత్ పార్థివ దేహానికి నివాళులర్పించి సంతాపం తెలిపారు.
షీలా దీక్షిత్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఆమె అరుదైన రాజకీయవేత్త అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, నిజామాబాద్ మాజీ ఎంపీ కవితలు సంతాపం తెలిపారు.