అత్యంత వైభవంగా లష్కర్ బోనాల జాతర..

705
Secunderabad Ujjaini Mahankali Bonalu
- Advertisement -

ఆషాడమాసం సందర్భంగా సికింద్రాబాద్‌లో వెలసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. నేడు ఉజ్జయిని మహంకాళి జాతర ప్రారంభమైంది. ఈ తెల్లవారుజామున 4.05 గంటలకు మొదటి పూజ ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలి బోనంతో పాటు వెండి తొట్టెలను మంత్రి అమ్మవారికి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన డప్పు చప్పుళ్లకు అభిమానులు, భక్తులతో కలిసి స్టెప్పులేశారు.

Minister Talasani

అమ్మవారికి శాక, ఫలహారపు బండ్లు, తొట్టెల ఊరేగింపు, రంగం, పోతరాజుల విన్యాసాలు, బలిగంప, గావు పట్టడం, అంబారిపై అమ్మవారి ఊరేగింపు వంటివి అమ్మవారికి రెండు రోజులపాటు నిర్వహించే ప్రధాన ఘట్టాలు. వీటిని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచి బోనాలతో వచ్చిన మహిళలతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. ఉదయం ప్రత్యేక పూజల అనంతరం భక్తులను అమ్మవారి దర్శనానికి వదిలారు. క్యూలైన్లు నెమ్మదిగా సాగుతున్నాయని, ఇప్పుడు అమ్మ దర్శనానికి వచ్చేవారికి కనీసం నాలుగు గంటల తరువాతే దర్శనమవుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

Talasani srinivas yadav

 

ఈ బోనాల వేడుక సందర్భంగా పోలీస్ అధికారులు భారీ బందోబస్తు, జీహెచ్‌ఎంసీ, జల మండలి, ఎలక్ట్రిసిటీ తదితర విభాగాల అధికారులు బోనాల పండుగకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు. బోనాలను సమర్పించే మహిళలకు ప్రత్యేకంగా బాటా చౌరస్తా నుంచి ఒకటి, రాంగోపాల్‌పేట పాత పోలీస్‌స్టేషన్ నుంచి మరొకటి ఏర్పాటు చేశారు. ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించారు. రేపు రంగం వేడుకలు నిర్వహించనున్నారు.

- Advertisement -