గ్రేటర్ ఎన్నికల ప్రచారం పీక్ దశలో ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 28న సీఎం కేసీఆర్ బహిరంగ సభ అదేరోజు ప్రధాని హైదరాబాద్‌కు రానుండటంతో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ,మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. దమ్ముంటే హైదరాబాద్ పాతబస్తీలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నిర్వహించాలంటూ ప్రధాని మోడీకి ఓవైసీ సవాల్ చేశారు. ప్రధాని మోడీ ఈ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తే ఎన్ని సీట్లు గెల్చుకుంటారో చూద్దామని అన్నారు.
ఇదిఇలా ఉంటే శనివారం రోజు మధ్యాహ్నం 3 గంటలా 45 నిమిషాలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు రానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి.. 4.10 గంటలకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ దాదాపు గంట సేపు గడిపే మోడీ… కరోనా వ్యాక్సీన్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు. కార్యక్రమం పూర్తయ్యాక నేరుగా ఢిల్లీ వెళ్లిపోతారు. గ్రేటర్ ఎన్నికలతో కానీ, ప్రచారంతో కానీ మోడీకి నేరుగా సంబంధం లేకపోయినా… హైదరాబాద్‌లో ఆయన పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.