మోదీ హోర్డింగ్‌లు తొలగించండి…ఈసీ సంచలన ఆదేశాలు..!

226
modi
- Advertisement -

దేశంలో రాజకీయ వేడి మొదలైంది. తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుర్చేరిలో అసెంబ్లీ ఎన్నికలషెడ్యూల్ ప్రకటించడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శ, ప్రతి విమర్శలతో రాజకీయం వాడీ వేడీగా సాగుతోంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీల మధ్య యుద్ధమే జరుగుతోంది. మమతాబెనర్జీని టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో సహా కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలంతా బెంగాల్‌పై దండయాత్ర చేస్తున్నారు.

మమతాబెనర్జీని ఓడించి బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని కాషాయనాథులు ఎంతగా దిగజారాలా అంతగా దిగజారుతున్నారు. అయితే బీజేపీ ఎత్తులకు దీదీ పై ఎత్తులు వేస్తూ కాషాయ నేతలను ఖంగుతినిపిస్తున్నారు. తాజాగా నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించడంతో గత నెల 27 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా కొవిడ్ – 19 వ్యాక్సినేషన్‌‌కు సంబంధించిన ప్రధాని మోదీ ప్రచార ఫొటోలు, వీడియోలను ఎన్నికలు జరిగే నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తొలగించలేదు. ఆయా ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల్లో, ప్రధాన కూడళ్లలో మోదీ వ్యాక్సినేషన్‌ ప్రచార హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తుందని టీఎంసీ అధినేత, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. దీంతో ఎన్నికలు జరిగే పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలోని పెట్రోల్ బంకుల్లోని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చిత్రాలతో ఉన్న హోర్డింగ్‌లను మూడు రోజుల్లోగా తొలగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తున్నట్టుగా ఉన్న ఆ హోర్డింగ్‌లు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తున్నదని ఈసీ స్పష్టం చేసింది. దీంతో అధికారులు ఆయా ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో మోదీ హోర్డింగ్‌లను తొలగించే పనిలో పడ్డారు. మొత్తంగా మమతాబెనర్జీ ఇచ్చిన షాక్‌కు బీజేపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయినట్లైంది.

- Advertisement -