కరోనా విజృంభణ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి క్యాబినెట్ సెక్రటరీ, ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగం సభ్యుడు డాక్టర్ వినోద్ పౌల్ హాజరైయ్యారు. కరోనా వ్యాప్తి నియంత్రణ, వ్యాక్సినేషన్ అంశంపై సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్, నియంత్రణ చర్యలు, వ్యాక్సినేషన్ ఈ ఐదు నియమాలను పాటిస్తే కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రతో పాటు ఛత్తీస్ ఘర్, పంజాబ్ రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపాలని ప్రధాని నిర్ణయించారు.ఈ నెల 6వ తేది నుంచి 14 వ తేది వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కరోనా జాగ్రత్తలు.. మాస్క్ వాడకంపై అవగాహన కల్పించాలని అధికారులకు ప్రధాని సూచించారు.
పరీక్ష కేంద్రాలు, ఆస్పత్రుల్లో బెడ్స్, సమయానికి అనుగుణంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని..మరణాలు తగ్గించే దిశగా ఆక్సిజన్ సరఫరా, ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు ప్రధాని. క్షేత్ర స్థాయిలో కరోనా నియంత్రణ మార్గదర్శకాలు పాటించేలా చూడాలని చెప్పారు ప్రధాని మోదీ.
అలాగే వ్యాక్సినేషన్ పై ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలతో కేంద్ర ఆరోగ్య శాఖ సమన్వయం చేసుకోవాలన్నారు మోదీ.గత 15 నెలల్లో దేశంలో కరోనా నిర్వహణ యొక్క సమిష్టి లాభాలు దెబ్బతినకుండా ఉండాలని సమావేశంలో అధికారులకు మోదీ సూచించారు. ఇందుకోసం అధిక కేసులను నివేదించే రాష్ట్రాలు, జిల్లాల్లో మిషన్-మోడ్ విధానాన్ని కొనసాగించాలని ఆదేశించారు.