ఈ నెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 2 వ తేదీ వరకు విదేశాల్లో పర్యటించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇటలీలో రోమ్ లో జరిగే జి-20 సమ్మిట్, యూకేలోని గ్లాస్గో లో జరిగే సీవోపీ-26 సమావేశాల్లో పాల్గొననున్నారు. పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లోనూ పాల్గొననున్నారు.
మొత్తం 5 రోజులపాటు విదేశాల్లో ఉండనున్న మోడీ.. మొదట రోమ్‌కు వెళతారు. ఈనెల 30, 31వ తేదీల్లో ఇటలీ ప్రధాని అధ్యక్షతన జరగనున్న జీ-20 దేశాల సదస్సులో పాల్గొంటారు. ఇందులో కరోనా మహమ్మారి విలయం, ఆరోగ్యం విషయాల్లో అంతర్జాతీయ సహకారం, ఆర్ధిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఆహార భద్రత, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.
జీ-20 సభ్య దేశాల అధ్యక్షులు, ప్రభుత్వ అధినేతలు పాల్గొనే ఈ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొనడం ఇది 8వ సారి. 2023లో ఈ సమావేశానికి భారత్ వేదిక కాబోతోంది. జీ-20 సమ్మిట్ ముగిసిన అనంతరం ప్రధాని మోడీ అక్కడ నుంచి స్కాట్లాండ్‌లోని గ్లాస్కోకు బయలుదేరుతారు. అక్కడ ఈనెల 31 నుంచి నవంబర్ 12 వరకు జరగనున్న కాప్-26 సదస్సుకు హాజరవుతారు. నవంబర్ 1, 2వ తేదీల్లో జరిగే వరల్డ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు ప్రధాని మోడీ. ఆ తరువాత భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు.