ఆదివారం ప‌్రధాని నరేంద్రమోదీ కొత్తగా 8 రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. కొత్తగా ప్రారంభమైన ఈ ఎనిమిది రైళ్లు గుజరాత్‌లోని కెవాడియా పట్టణం నుంచి దేశంలోని ఎనిమిది ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి. గుజరాత్‌లోని కెవాడియా పట్టణం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన స్టాట్యూ ఆఫ్ యూనిటీకి హోమ్‌టౌన్‌గా ఉన్నది.
సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ.. 2018 అక్టోబర్‌లో పటేల్ భారీ విగ్రహమైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఆవిష్కరించారు. గిరిజన ప్రాంతమైన కెవాడియాలో పర్యాటకానికి ఊతమివ్వడానికి, స్టాట్యూ అఫ్ లిబర్టీకి ప్రపంచ నలుమూలల నుంచి కనెక్టివిటీ సదుపాయం కల్పించడానికి కొత్తగా రైళ్లను ప్రారంభించినట్లు ప్రధాని పేర్కొన్నారు.
కాగా, కొత్తగా ప్రారంభమైన ఈ ఎనిమిది రైళ్లు కెవాడియా-వారణాసి, కెవాడియా-దాదర్, కెవాడియా-అహ్మదాబాద్, కెవాడియా-హజ్రత్, కెవాడియా-నిజాముద్దీన్, కెవాడియా-రేవా, కెవాడియా-చెన్నై, కెవాడియా-ప్రతాప్‌నగర్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. ఈ కార్యక్రమానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.