కరోనాపై పోరులో విజయం మనదే – మోదీ

345
modi

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తమ పార్టీ కార్యకర్తలకు సందేశమిస్తూ మాట్లాడారు. దేశంలో లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు చూపిన పరిణతి, చిత్తశుద్ది కనీవినీ ఎరుగనివని ప్రధాని మోదీ ప్రశంసించారు. కరోనాపై జరిపే పోరాటంలో మనం అలసిపోరాదని, ఈ పోరులో విజయం మనదే కావాలన్న దృఢదీక్ష, సంకల్పం ఉంటే చాలునని అన్నారు. ఇదే మన లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.

‘మన తల్లులు, సోదరీమణులు గతంలో యుద్ధాలు జరిగిన సమయంలో వారి ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధ పరిస్థితుల కంటే తక్కువేం కాదు. మనుషులను రక్షించాల్సిన యుద్ధం ఇది. ప్రతి బీజేపీ కార్యకర్త పీఎం కేర్స్‌ ఫండ్‌కు సాయం చేయాలి. మరో 40 మందిని ఇదే పని చేసే విధంగా ప్రోత్సహించాలి’ అని చెప్పారు.

ఈ రాకాసిపై పోరాటానికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటల 9 నిముషాలకు 9 నిముషాలపాటు తమ ఇళ్ల బాల్కనీలు, వరండాల్లో దీపాలు, కొవ్వొత్తులను వెలిగించాలన్న తన పిలుపునకు అఖండ స్పందన లభించిన నేపథ్యంలో.. ఇది మన సమష్టి బలాన్ని సూచించిందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఐదు సూత్రాల అజెండాను పాటించాలని, దేశంలో ఏ పేదవాడూ ఆకలికి గురికాకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని మోదీ కోరారు.

ప్రజలు ‘ఎక్కడికి వెళ్లినా మీ ముఖానికి మాస్కులు ధరించండి. మీ ఇంట్లో ఉన్నా ముఖానికి మాస్కులు ధరించే ఉండాలి. కరోనా కట్టడికి ప్రపంచం జపిస్తోన్న మంత్రం ఒక్కటే.. సామాజిక దూరం పాటించాలి, క్రమశిక్షణతో మెలగాలి. ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను అభివృద్ధి చేసింది. దీని గురించి ప్రజలందరికీ చెప్పాలి. ప్రతి ఒక్కరు 40 మందితో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకునేలా చేయాలి. తమ చుట్టూ ఉన్న కరోనా బాధితుల గురించి దీని వల్ల వారికి తెలుస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ విషయాలను తెలుసుకోవడం ముఖ్యం’ అని మోదీ తెలిపారు.