మనం సాధిస్తాం..మోదీ ప్రతిజ్ఞ

1
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి నివాళులు అర్పించిన ఆయన.. ప్రజలు తనకు పదేపదే సేవ చేసే అవకాశం కల్పించారని అన్నారు. ఢిల్లీలో జరిగిన ‘సేవా జ్యోతి’ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ‘సేవా జ్యోతి యాత్ర’లో పాల్గొన్న ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ప్రజా సేవను తాను ఎప్పుడూ బాధ్యతగానే భావించానని మోదీ చెప్పారు. దేశం తనకు ఎంతో ఇచ్చిందని, అందుకే దేశం పట్ల తన బాధ్యత కూడా అంతే గొప్పదని పేర్కొన్నారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించేందుకు మరింత శక్తితో పనిచేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

ప్రజా జీవితంలో 25 ఏళ్లుగా ప్రజల నుంచి లభించిన విశ్వాసం, అనుభవాన్ని మోదీ ఒక గొప్ప ఆస్తిగా అభివర్ణించారు. ఈ అనుభవం తనకు మాత్రమే చెందదని, మొత్తం దేశానికి చెందినదని చెప్పారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ ఈ అనుభవం ద్వారా ప్రయోజనం పొందే హక్కు ఉందన్నారు.

తన ప్రజా సేవా ప్రయాణంలో ఎప్పుడూ ఒంటరిగా భావించలేదని మోదీ పేర్కొన్నారు. దేశ సేవ కోసం నిరంతరం పనిచేస్తున్న స్వయంసేవకులు, కార్యకర్తల అంకితభావాన్ని ప్రశంసించారు. దేశ సాంస్కృతిక ఆత్మను కాపాడుతూ సేవా భావంతో పనిచేసే అనేక మంది తనకు అండగా ఉన్నారని చెప్పారు.దేశ అభివృద్ధి లక్ష్యాలకు మరింత ఉత్సాహాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మోదీ తన ప్రసంగంలో ‘మనం సాధిస్తాం’ (We will do it) అనే నినాదాన్ని ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రతి లక్ష్యానికి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు కూడా అదే నినాదంతో స్పందించారు.

Also Read:‘ది ట్రెయిటర్స్’..తెలుగులో!

2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించడం, ఆత్మనిర్భర్ భారత్‌ను సాధించడం, ప్రపంచ తయారీ రంగంలో భారత్‌ను కీలక కేంద్రంగా మార్చడం వంటి లక్ష్యాలను మోదీ ప్రస్తావించారు. భారత్‌లో ఒలింపిక్స్ నిర్వహించడం, అంతరిక్ష రంగంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం వంటి ఆకాంక్షలను కూడా ఆయన వెల్లడించారు.ఈ లక్ష్యాలను సాధించేందుకు దేశ ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పగా ఉందని మోదీ అన్నారు.

- Advertisement -