ప్రధాని నరేంద్ర మోదీ 2021లో తొలి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలిండియా రేడియోలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని టీమిండియాపై, వికలాంగ వృద్ధుడు ఎన్ఎస్ రాజప్పన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ నెలలో భారత జట్టు శుభవార్త అందించిందని అన్నారు. ఆస్ట్రేలియా టూర్లో ఆరంభంలో కష్టాలు ఎదుర్కొన్నా, ఆపై అద్భుతంగా పుంజుకుని ఘనవిజయం సాధించారని కొనియాడారు. మన ఆటగాళ్ల కఠోరశ్రమ, సమష్టికృషి స్ఫూర్తిదాయకం అని కితాబిచ్చారు.
అదేవిధంగా కేరళ రాష్ట్రం కొట్టాయం పట్టణానికి చెందిన వికలాంగ వృద్ధుడు ఎన్ఎస్ రాజప్పన్ దృఢ సంకల్పం గురించి ప్రధాని వెల్లడించారు. ‘కేరళలోని కొట్టాయంలో ఎన్ఎస్ రాజప్పన్ అనే ఒక దివ్యాంగుడైన వృద్ధుడు ఉన్నాడు. పక్షవాతం కారణంగా ఆయన రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. అయినా, ఆయన కొట్టాయంలోని వెంబనాడ్ సరస్సును శుభ్రం చేయాలన్న తన సంకల్పాన్ని వీడలేదు. గత కొన్నేండ్లుగా ఆయన ఒక చిన్న పడవ సాయంతో వెంబనాడ్‌లో సరస్సులో తిరుగుతూ.. అందులో పర్యాటకులు పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, గ్లాసులు ఇతర చెత్తా చెదారాన్ని ఏరి పారేస్తుంటాడు. ఒక్కసారి ఊహించుకోండి రాజప్పన్ సంకల్పం ఎంత ఉన్నతమైనదో’ అని ప్రధాని మోదీ ప్రశంసించారు.