డబ్బు తీసుకొని నన్ను వదిలేయండి..!

263
- Advertisement -

ప్రభుత్వ రంగ బ్యాంకులకు సుమారు రూ.9,000 కోట్ల కుచ్చుటోపి పెట్టి బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా దిగివచ్చారు. తాను తీసుకున్న మొత్తం రుణాలను తిరిగి చెల్లిస్తాననీ, తనను వదిలిపెట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. సీబీఐ తనకు వ్యతిరేకంగా క్షుద్ర కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనపై కావాలనే కేసులు పెట్టారని, దేవుడి దయ వల్ల కోర్టులో తనకు న్యాయం జరిగిందన్నారు.మాల్యాను భారత్‌కు అప్పగించే విషయమై గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాలు చేసేందుకు హైకోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పుపై వరుస ట్వీట్లు చేసిన మాల్యా.. బ్యాంకులు తానిచ్చిన ఆఫర్‌ తీసుకోవాలని మరోసారి అన్నారు.

Vijay Mallya

‘దేవుడు గొప్పవాడు. న్యాయం ఇంకా మిగిలి ఉంది. సీబీఐ నాపై మోపిన ప్రాథమిక అభియోగాలపై ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ఇంగ్లిష్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అప్పీల్‌కు అవకాశమిచ్చింది. సీబీఐ అభియోగాలు తప్పు అని నేను చెప్తూ వస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ పూర్తిగా తిరిగి చెల్లిస్తానని, దయచేసి డబ్బు తీసుకొని.. తనను వదిలిపెట్టాలంటూ మరోసారి విజయ్‌ మాల్యా వేడుకున్నాడు.

‘కోర్టు తీర్పు నాకు అనుకూలంగా వచ్చినప్పటికీ.. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలన్నింటినీ పూర్తిగా చెల్లిస్తానని మరోసారి ఆఫర్‌ ఇస్తున్నాను. దయచేసి డబ్బు తీసుకోండి. ఉద్యోగులకు, ఇతర రుణదాతలకు కూడా డబ్బు చెల్లించి.. జీవితంలో ముందుకు సాగుతాను’ అని మాల్యా పేర్కొన్నాడు. సీబీఐ తనపై మోపిన ప్రాథమిక అభియోగాలను సవాల్‌ చేసేందుకు బ్రిటన్‌ హైకోర్టు తనకు అనుమతి ఇచ్చిందని, తనను హేళన చేస్తున్న వాళ్లంతా ఈ విషయాన్ని అందరూ గమనించాలని మాల్యా కోరాడు.

- Advertisement -