తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న టియస్ ఐపాస్ విధానానికి కేంద్ర పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న టియస్ ఐపాస్ విధానానికి సంబంధించిన సంపూర్ణ సమాచారం అందిస్తే దాని పైన అధ్యయనం చేస్తామని మంత్రి పియూష్ గోయల్ అన్నారు.ఈరోజు రాష్ట్రాల పరిశ్రమల శాఖా మంత్రులతో “వన్ డిస్టిక్- వన్ ప్రాడక్ట్” కార్యక్రమంపైన నిర్వహించిన సమావేశంలో పీయూష్ గోయల్ ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం పైన అభినందనలు కురిపించారు.
భారతదేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది నిజమైన ఆత్మ నిర్బర్ భారత్ కావాలంటే భారీ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనే మార్గమని ఈ సందర్భంగా తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చేపడుతున్న భారీ పారిశ్రామిక పార్కులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించాలని మంత్రి కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ హైదరాబాద్ ఫార్మా సిటీ , దేశంలోనే అతి పెద్దదైన టెక్స్టైల్ పార్కు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైస్ పార్క్ గా హైదరాబాద్ మెడికల్ డివైస్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
వీటికి జాతీయ ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో వీటి అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. హైదరాబాద్ నగరం భారతదేశ బల్క్ డ్రగ్ క్యాపిటల్ గా ఉన్నదని, దీంతో పాటు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ లను తయారుచేస్తూ ప్రపంచ వ్యాక్సిన్ కాపిటల్ గా హైదరాబాద్ నగరం వుందన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగంలో మరింత అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆ దిశగా వాటిని అందిపుచ్చుకునేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తెలిపారు. గత ఆరు సంవత్సరాల్లో టియస్ ఐపాస్ ద్వారా అనుసరించిన సెల్ప్ సర్టిఫికేషన్, డీమ్డ్ అప్రూవల్స్ వంటి చర్యలతో ఈజ్ అప్ డూయింగ్ ర్యాంకుల్లో అగ్రస్ధానంలో నిలుస్తూవస్తున్నామని మంత్రి కెటియార్ అన్నారు. దీంతో తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో స్థానిక యువకులకు ఉద్యోగాలు కల్పించే విషయంలోనూ ఇతర రాష్ట్రాల కన్నా విభిన్నమైన, వినూత్నమైన కార్యాచరణ చేపట్టిందన్నారు.
స్థానిక ఉద్యోగాలకు సంబంధించి కఠినమైన నిబంధనలు మాత్రమే ఉంచకుండా ఈ విషయంలో పరిశ్రమను సైతం ప్రోత్సహించే విధంగా స్థానికులకు ఉద్యోగాలు కల్పించే వారికి మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా ఒక ప్రోగ్రెసివ్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణలో పరిపాలనా సౌలభ్యం కోసం చిన్నచిన్న జిల్లాలు ఏర్పాటుచేసిన నేపథ్యంలో కేంద్ర పరిశ్రమల శాఖ ఈరోజు చర్చించిన ఒక జిల్లా ఒక ప్రోడక్ట్ కార్యక్రమానికి సంబంధించి తన అభిప్రాయాలను సవివరంగా వ్యక్తీకరిస్తామని తెలిపారు.