ప్రస్తుతం ప్రపంచం దృష్టంత ర్యాన్‌సమ్ వైరస్ వన్నా క్రై మీదే ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు మూడు లక్షల కంప్యూటర్లలో తమ ప్రభావాన్ని చూపించింది ఈ మాల్‌వవేర్. ఈ లిస్ట్‌లో పెద్ద పెద్ద కంపెనీలతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన ప్రభుత్వ వెబ్ సైట్లు కూడా ఉన్నాయి. అందులో ‘పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్-5’ సినిమా కూడా ఉంది. మరో పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవ్వడానికి సిద్దమవుతున్న ఈ సినిమాను హ్యకర్లు హ్యక్ చేశారు. రూ. రెండు వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కాపీ తమ వద్ద ఉందంటూ హ్యకర్లు బెదిరింపులకు పాల్పడ్డారు. డిస్నీ నిర్మాణంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు జానీ డెప్ నటించిన ఈ సినిమా మే 25న విడుదల అవుతోంది.
ఇప్పుడు సినిమాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అడిగినంత డబ్బు చెల్లించాలని లేకపోతే సినిమా మొత్తం లీక్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఈ విషయాన్ని డిస్నీ స్టూడియో సీఈవో బాబ్ ఇగర్ సోమవారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. అయితే తాము డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదని దీనిపై ఎఫ్‌బీఐను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో హాలీవుడ్‌పై సైబర్ నేరగాళ్లు గురిపెట్టారు.

గతంలో అమెరికన్ టీవీ సీరీస్ ‘ఆరెంజ్’ ఎసిసోడ్స్‌ని హ్యాక్ చేసి డబ్బు చెల్లించాల్సిందిగా బెదిరింపులకు దిగారు.. నిర్మాతలు ససేమిరా ఒప్పుకోకపోవడంతో కొన్ని భాగాలను నెట్‌ఫ్లిక్స్‌లో లీక్ చేసేశారు. 2014లో ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ ను హత్య చేసే పన్నాగం కథాంశంతో సోనీ ఓ సినిమాను తీయగా, దాని విడుదలకు కొన్ని రోజుల ముందు సైబర్ దాడి జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్’ సిరీస్ సినిమాల్లో ఐదవ సినిమాగా ‘పైరేట్స్ ఆఫ్ కరేబియన్:డెడ్ మేన్ టెల్ నో టేల్స్’ విడుదల కానుంది.

