వ్యవసాయ ఆదాయంపై పన్ను..పిల్‌!

3
- Advertisement -

ఢిల్లీలో వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (PIL) విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ ను న్యాయస్థానం తప్పుబట్టింది. ప్రధాన న్యాయమూర్తి డి.కె. ఉపాధ్యాయ మరియు జస్టిస్ తేజస్ కారియాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్‌ను తిరస్కరించింది.

పన్ను విధానాలను రూపొందించడం లేదా కొత్త పన్ను చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టులకు ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా శాసనసభ పరిధిలోని అంశమని పేర్కొంది. ప్రభుత్వం ఫలానా చట్టం చేయాలని తాము ‘మాండమస్’ జారీ చేయలేమని, చట్టాలు చేయడం లేదా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రభుత్వం చూసుకోవాల్సిన విషయమని కోర్టు వెల్లడించింది.

జీతాలు పొందే ఉద్యోగులు, వ్యాపారులు పన్నులు చెల్లిస్తుంటే, వ్యవసాయ ఆదాయం పేరుతో కొందరు సంపన్న వ్యక్తులు భారీ ఆదాయాన్ని కలిగి ఉన్నప్పటికీ పన్ను మినహాయింపు పొందుతున్నారని పిటిషనర్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఎంట్రీ 46 కింద వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలకు (ఢిల్లీకి కూడా) ఉందని, అయితే దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది పన్ను చెల్లింపుదారుల మధ్య వివక్ష చూపుతోందని, సమానత్వ హక్కును ఉల్లంఘిస్తోందని ఆయన వాదించారు. చివరకు, ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని పేర్కొంటూ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

Also Read:TTD:శ్రీవారి టికెట్లలో అవకతవకలు

- Advertisement -