ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులు బంద్!

226
Petrol Dealers Decided to Close on Sundays
- Advertisement -

ఇక పై ప్రతి ఆదివారం కేవలం ప్రభుత్వాఫీసులకు మాత్రమే సెలవు కాదు. ఇక పెట్రోల్, డీజిల్ బంకుల యాజమాన్యాలు సెలవును తీసుకోనున్నాయి. మే 14 నుంచి ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లు మూసివేయనున్నామని పెట్రోలియం డీలర్స్ ప్రకటించారు .కమీషన్‌ను పెంచాలన్న డిమాండు పరిష్కారానికి నోచుకోకపోవడంతో డీలర్స్ అసోసియేషన్  వినూత్న తరహాలో నిరసన చేపట్టాలని నిర్ణయించింది.

ఈ ప్రభావం దేశవ్యాప్తంగా ఉన్న 25వేల పెట్రోల్ బంకులపై పడనుందని తెలుస్తోంది. లీటరు డీజిల్ పై రూపాయి 65పైసలు, లీటరు పెట్రోల్ పై రెండు రూపాయల 56 పైసల కమిషన్ ను ప్రస్తుతం డీలర్లు పొందుతున్నారు. ఈ కమిషన్ ను మరింత పెంచాలని చాలాకాలంగా డీలర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు డీలర్స్ కమిషన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Petrol Dealers Decided to Close on Sundays

దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ డీలర్లందరితోనూ చర్చలు జరిపామని పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ నాయకుడు రవి షిండే తెలిపారు. డీలర్లకు కమీషన్ భారీగా పెంచుతామని నాలుగు నెలల క్రితం ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. దాంతో జనవరిలో తలపెట్టిన సమ్మె ప్రతిపాదనను కూడా విరమించుకున్నాం. కానీ ఇప్పటివరకు మా డిమాండ్ నెరవేరలేదు అని అన్నారు. అపూర్వ చంద్ర కమిటీ నివేదిక ప్రకారం కమీషన్ పెంచకపోవడంపై దేశంలోని పెట్రోల్ డీలర్లందరూ అసంతృప్తితో ఉన్నారని షిండే అన్నారు. ప్రభుత్వానికి మే 10 వరకు గడువిస్తున్నాం. అప్పటిలోగా మా డిమాండ్ పరిష్కారం కాకపోతే.. పదో తేదీన సంస్థల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయబోమని ఆయన తెలిపారు.

మే 10న నో పర్చేజ్ డేగా(కొనుగోళ్ల నిరాకరణ దినం) పాటించనున్నారు. అంటే బంకు డీలర్లెవరూ సంస్థల నుంచి ఇంధనం కొనుగోలు చేయరన్నమాట. ఫలితంగా తర్వాత రోజుల్లో బంకుల్లో ఇంధన కొరత సమస్య ఏర్పడనుంది.  ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజయ్ బన్సాల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ ప్రభావం దేశవ్యాప్తంగా పడదని, సీఐపీడీ యాక్టివేట్ లో ఉండే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆదివారాలు పెట్రోల్, డీజిల్ బంకులు మూతపడతాయని తెలిపారు.

- Advertisement -