వారం రోజుల క్రితం ప్రెమోన్మాది దాడిలో గాయపడిన వరంగల్ విద్యార్థిని రవళి చికిత్స పొందుతూ మృతి చెందింది. 80శాతం కాలిన గాయాలతో వారం రోజుల నుంచి హైదరబాద్ లోని యశోదా ఆసుప్రతిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచింది. తన ప్రేమను నిరాకరించిందంనే కోపంతో వరంగల్‌లో రవళి అనే యువతిపై అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిందే. మొదట ఆమెకు వరంగల్ లో చికిత్స అందించిన వైద్యులు.. రవళి పరిస్ధితి విషమించడంతో హైదరబాద్ కు తరలించారు.
రవళి ఊపిరితిత్తుల్లో పొగబారి ఉబ్బిపోయాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో ఆమెను గత ఆరు రోజుల నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. రవళిని కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని మంగళవారం అప్పగిస్తామని అధికారులు చెప్పినట్లు రవళి బంధువులు తెలిపారు. రవళి మృతి చెందిందన్న విషయం తెలుసుకున్న ఆమె బంధువులు, మహిళా సంఘాల ప్రతినిధులు భారీగా ఆస్పత్రికి చేరుకున్నారు. అన్వేష్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.