బంగాళాఖాతంలో పెథాయ్ తుపాను కొనసాగుతోంది. పెథాయ్ తుపాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉన్న తీవ్ర వాయుగుండం శనివారం తుపానుగా బలపడిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఇది మరింత బలోపేతమై 17వ తేదీ మధ్యాహ్నం ప్రాంతంలో మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరం దాటొచ్చని, అనంతరం భూమార్గంలో విశాఖ జిల్లా వైపుగా పయనించొచ్చని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తుపాను తీవ్రత తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాలపై ఉంటుందని హెచ్చరించారు. అధికారులు శనివారం రాత్రి విడుదల చేసిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ తుపాను ట్రికోమలీ (శ్రీలంక)కి 440 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 590 కి.మీ, మచిలీపట్నానికి 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఆదివారం తీవ్ర తుపానుగా బలపడుతుంది.
సోమవారం కూడా అదే తీవ్రతతో కొనసాగి మధ్యాహ్నం ఉత్తరవాయవ్య దిశగా ప్రయాణించి మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం తాకొచ్చు. అదే తీవ్రతతో విశాఖవైపుగా దిశ మార్చుకునే అవకాశం ఉంది. ఈ తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత గంటకి 90 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని అంచనా. అమెరికాకు చెందిన జేటీడబ్ల్యుసీ సంస్థ మాత్రం.. కాకినాడ – విశాఖ జిల్లా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తోంది.
తుఫానుపై సమీక్ష జరిపిన ఏపీ సీఎం చంద్రబాబు, ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తుఫాను తీరం దాటే సమయం ముందుగానే తెలుస్తుంది కాబట్టి, ఆ ప్రాంతంలోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మండలానికో అధికారిని ప్రత్యేకంగా నియమించి సహాయక చర్యలను తక్షణం చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.