తెలంగాణ చరిత్ర, ఉద్యమం, సంస్కృతికి సంబంధించిన విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలని, అందుకు రాష్ట్ర గ్రంథాయ సంస్థ చొరవ చూపాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తనకు పూల బొకేలకు బదులు పుస్తకాలు బహకరించాలని సబితా పిలుపు ఇచ్చారు. మొదటి పుస్తకాన్ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ చేతుల మీదుగా స్వీకరించారు.
ముఖ్యమంత్రి పిఆర్వో, రచయిత గటిక విజయ్ కుమార్ రాసిన ఉజ్వల ప్రస్థానం పుస్తకాన్ని శ్రీధర్ మంత్రికి అందించారు. పూర్వయుగాల నుంచి తెలంగాణ చరిత్ర, రాజవంశాలు, తెలంగాణ ఉద్యమం, ప్రగతి తదితర అంశాలకు సంబంధించిన ఉజ్వల ప్రస్థానం పుస్తకాన్ని అందుకోవడం తనకు ఆనందంగా ఉందని సబిత అన్నారు. ఉజ్వల ప్రస్థానం లాంటి పుస్తకాలను అన్ని గ్రంథాలయాలకు చేర్చి, ప్రజలకు మన గతం, వర్తమానం గురించి తెలుసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో గ్రంథాలయాలకు మౌలిక సదుపాయలు కల్పించడానికి, మరిన్ని పుస్తకాలు సేకరించడానికి తాను చొరవ చూపుతానని సబిత అన్నారు. దాతలు, రచయితలు కూడా ముందకొచ్చి గ్రంథాలయల ప్రాముఖ్యతను కాపాడడానికి కృషి చేయాలని సబిత పిలుపునిచ్చారు.