కొత్త లేదా అనుమానాస్పద నంబర్ల నుంచి కాల్ వచ్చి, అవతలివైపు నుంచి ఎలాంటి మాట లేకుండా సైలెంట్‌గా ఉంటే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం (DoT) హెచ్చరించింది. ఇలాంటి కాల్స్ వెనుక సైబర్ నేరగాళ్ల కుట్ర ఉండే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
మీ మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉందో లేదో తెలుసుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారని DoT తెలిపింది. ఒకసారి మీరు ఆ కాల్‌కు స్పందిస్తే లేదా తిరిగి కాల్ చేస్తే, మీ నంబర్ ఉపయోగంలో ఉందని నిర్ధారించుకుని తదుపరి మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫ్రాడ్ కాల్స్, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలకు ఇది దారితీయవచ్చని తెలిపారు.
ఇలాంటి సైలెంట్ కాల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి కాల్ చేయవద్దని ప్రజలకు సూచించారు. అలాగే, అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే వాటిని ప్రభుత్వ సంచార్ సాథీ యాప్ ద్వారా రిపోర్ట్ చేయాలని DoT సూచించింది. ఈ యాప్ ద్వారా ఫేక్ కాల్స్, మోసపూరిత నంబర్లు, అనధికార సిమ్ కార్డులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉందని వివరించింది.
ప్రజలు తమ వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదని, తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర టెలికాం శాఖ మరోసారి గుర్తు చేసింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వానికి సహకరించాలని కోరింది.
Also Read:కాంగ్రెస్ గుండాగిరిపై కేటీఆర్ కన్నెర్ర..

