మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన బీజేపీ ఎంపీల సమావేశంలో చర్చించిన అంశాలు లీక్ కావడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో జరిగిన విషయాలను బయటకు చెప్పొద్దని స్వయంగా ప్రధానమంత్రి స్పష్టంగా సూచించారని, అయినప్పటికీ కొందరు నేతలు ఆ సమావేశ వివరాలను లీక్ చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. లీకులు ఇచ్చిన వారు మానసికంగా అస్థిరుల్లా ప్రవర్తించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఈ లీకులకు బాధ్యులో తేలితే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
అలాగే, పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని ప్రధాని సూచించినట్టు తెలిపారు. తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని, రాష్ట్రంలో పార్టీకి ప్రజాదరణ పెంచేందుకు కృషి చేయాలని మోదీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారని చెప్పారు.
బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి పార్టీ అధ్యక్ష స్థాయి వరకూ ఎదగడానికి అవకాశం ఉంటుందనేదే పార్టీ ప్రత్యేకత అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఇప్పటివరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఇది బీజేపీ సమాన అవకాశాల సిద్ధాంతానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో పార్టీ భవిష్యత్ బలంగా ఉంటుందన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Also Read:BRSLP సమావేశం 21కి వాయిదా

