రాఘవేంద్రరావు ‘పెళ్లిసందడి’ మళ్లీ మొదలుకానుంది..

218
pelli sandhadi

‘పెళ్లిసందడి’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం సృష్టించింది. 1996 లో రాఘవేంద్రరావు శ్రీకాంత్, దీప్తి భట్నాగర్, రవళి ప్రధాన పాత్రలలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిన్న తారాగణంతో కె.రాఘవేంద్రరావు ప్రయోగాత్మకంగా రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. అప్పటివరకు ఏవో సినిమాలు చేస్తూ వస్తున్న హీరో శ్రీకాంత్ కు ఒక్కసారిగా స్టార్ స్టేటస్ ను తెచ్చిపెట్టింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే టైటిల్‌తో రాఘవేంద్రరావు మరో సినిమా చేయనున్నట్టు ఈ రోజు వెలువడిన ప్రకటన టాలీవుడ్ లో ఓ సంచలనమైంది.

ఆర్కా మీడియా నిర్మించ‌నున్న పెళ్ళి సంద‌డి చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా, చంద్ర‌బోస్, శివశక్తిదత్తా లిరిక్స్ ఇస్తున్నారు. రాఘ‌వేంద్ర‌ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం మ్యూజిక్‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాలు జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లో మూవీకి సంబంధించిన న‌టీన‌టులు ఎవ‌రనేది తెలియ‌జేయ‌నున్నారు. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ఈ మూవీని కొత్త నటీన‌టుల‌తో రూపొందించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

మరోవైపు ఈ చిత్రంలో హీరోగా శ్రీకాంత్‌ తనయుడు రోషన్ నటించబోతున్నట్లు బాగా వినిపిస్తోంది.. ఆమధ్య నాగార్జున నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.ఈ కొత్త ‘పెళ్లిసందడి’కి రోషన్ ని రాఘవేంద్రరావు ఎంచుకున్నట్టు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొంతకాలం వేచిచూడాలి.