Srikanth Addala:యూనిక్‌గా ‘పెదకాపు-1’

27
- Advertisement -

యంగ్ టాలెంటెడ్ విరాట్ కర్ణ హీరోగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ట్రైలర్ పాటలు సినిమాపై అంచనాలని పెంచాయి. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విలేకరుల సమావేశంలో ‘పెదకాపు-1’ విశేషాలని పంచుకున్నారు.

పెదకాపు 1 లాంటి రా రస్టిక్ సినిమా చేయడానికి కారణం నారప్ప ప్రభావం అనుకోవచ్చా ?
పెదకాపు ఎప్పుడో చేసుకున్న కథే. పెద్ద హీరోలతో కొన్ని, కొత్త వాళ్లతో కొన్ని కథలు చేసుకోవడం నాకు మొదటి నుంచి అలవాటు. ‘ముకుంద’లో కూడా కొంచెం ఈ షేడ్ వుంటుంది. ఐతే ఇంతకుముందే ‘నారప్ప’ చేయడం వలన కొంచెం ఆ ప్రభావం అనిపించి వుంటుంది.

ఈ సినిమాకి స్ఫూర్తి ఏమిటి ?
1982లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా నాన్న గారు ఊర్లో చాలా క్రియాశీలంగా వుండేవారు. ఒక కొత్తపార్టీ వస్తుందంటే జీవితాల్లో ఏదో కొత్త మార్పు వస్తుందనే ఆశ అందరిలో వుంటుంది. దాదాపు 294 మందిని కొత్తవారిని ఎంపిక చేశారు. అప్పుడు వచ్చిన రాజకీయ సమీకరణాల నేపధ్యంలో, కొన్ని సంఘటన ఆధారంగా ఫిక్షన్ ని జోడించి చేసిన కథ ఇది. ఒక విధంగా చెపాలంటే దీనికి స్ఫూర్తి మా నాన్నగారే.

ఈ చిత్రానికి హీరోగా ముందు ఎవరికైనా అనుకున్నారా ?
కొత్తవాళ్ళ కోసం కొన్ని కథలు రాసుకుంటాను. అలా రాసుకున్న కథే ఇది. మల్టీ స్టారర్ గా అన్నయ్ చేద్దామని సన్నాహాలు చేస్తున్నాను. దానికి ఇంకా సమయం పడుతుంది. ఇంతలో నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గారు పెదకాపు కథ చేద్దామని అన్నారు. సమయం కూడా కుదురుతుంది కాబట్టి ఈ సినిమా చేయడం జరిగింది. కొత్త వాళ్ళకు సరిపోయే కథ ఇది. ఈ కథ అనుకున్నపుడే రెండు పార్టులు చేయాలని అనుకున్నాం. పెదకాపు యూనిక్ స్టొరీ. ఇందులో వైలెన్స్ కాస్త ఎక్కువగానే వుంటుంది.

ఇంతమంది కొత్త వాళ్ళతో చేయడం సవాల్ గా అనిపించిందా ?
కొత్తబంగారు లోకం, ముకుందా ఇలా కొత్తవాళ్ళతో సినిమా అనుభవం వుంది. కొత్తవాళ్లతో చేయడం ఫ్రెష్ గా బావుంటుంది. ఒక సవాల్ గా చేయొచ్చు.

పెదకాపు టైటిల్ ఒక కమ్యునిటీకి సూచించినట్లు అనిపిస్తుంది కదా ?
నిజానికి ఇందులో కమ్యూనిటీ ప్రస్తావన వుండదండీ. మొదట ఈ సినిమాకి కర్ణ అనే పేరు అనుకున్నాం. ఒకసారి గొల్లమాడిపల్లి అనే వూరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పేరు బ్రాకెట్ లో పెదకాపు అని వుంది. దీని కోసం అడిగితే పదిమందిని కాపాడి, పదిమంది సాయం చేసిన వాడు పెదకాపు అని చెప్పారు. మనం చెప్పదలచుకున్న కథ కూడా అదే కదా ఈ పేరు పెడదామని నిర్మాతకు చెప్పాను. బావుంది ఇదే పేరు పెడదామని అన్నారు. అలా పెదకాపు పేరు ఖరారు చేశాం.

Also Read:టార్గెట్ 175.. నో బ్రేక్స్?

ఇందులో నటుడిగా కూడా చేశారు.. ఆ పాత్ర చేయడానికి కారణం ? అదే పాత్ర ఎందుకు చేయాలనిపించింది ?
నిజానికి ఈ పాత్ర కోసం ఒక కేరళ నటుడిని అనుకున్నాం. ఐతే ఆయన ఏవో కారణాలు వలన రాలేదు. మరో రోజు వెయిట్ చేశాం. ఆయనకి కుదరలేదు. ఇలా ఎదురు చుస్తే ప్రొడక్షన్ ఖర్చు. అప్పటికే నాగబాబు గారు, రావు రమేష్ గారు ఇలా చాలా మంది ఆర్టిస్టులతో కాంబినేషన్ వుంది. అందరి డేట్స్ ఇబ్బందిలో పడతాయి. ఇక ఆ పాత్ర నేను చేసేయాలని అనుకున్నాను. ఒకసారి అనుకున్న తర్వాత మళ్ళీ ఆలోచించలేదు. ఆ పాత్ర చేయడం చాలా నచ్చింది. ప్రీమియర్ చూస్తున్నపుడు చాలా ఎంజాయ్ చేశాను. అలాగే ఇందులో తనికెళ్ళ భరణి గారి పాత్రతో పాటు అన్ని ప్రధాన పాత్రలకి నా వాయిస్ తో ఇంట్రో వీడియోలు చేసి విడుదల చేశాం. వాటికి కూడా మంచి స్పందన వచ్చింది. ఇందులో రావు రమేష్ గారు, అనసూయ గారి పాత్రలు కూడా చాలా బలంగా వుంటాయి.

ఈ సినిమా మ్యూజిక్ ఎలా వుంటుంది ?
మిక్కీ జే మేయర్ చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ చాలా ప్లస్. నాతో పాటు ఆయన కూడా దీని కోసం ట్రాన్స్ ఫర్మ్ అయ్యారు.

డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి ?
ప్రిమియర్స్ చూశాం. యునానిమస్ గా అందరూ చాలా బావుందని అంటున్నారు. డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘నీకే అంత వుంటే మాకు ఎంత వుండాలి’ అనే డైలాగ్ అందరికీ చాలా కనెక్ట్ అయ్యింది. ఆ మాట కొన్నేళ్ళు నిలిచిపోతుంది.

సామాన్యుడి ప్రతినిధిగా విరాట్ కర్ణ ఎలా నటించారు ?
విరాట్ కర్ణకి ఇది తొలి సినిమా. మొదటి సినిమాకి కొన్ని కష్టాలు వుంటాయి. అయితే తనతో నటింపజేసే భాద్యత నాది. తనకి ఎలా కావాలో అలా చెప్పించి మంచి నటన రాబట్టుకున్నాను. తను కూడా చాలా కష్టపడ్డాడు.

ఈ సినిమా విషయంలో మీకు సవాల్ గా అనిపించిన అంశం ఏమిటి ?
నిజానికి ఈ జోనరే ఒక సవాల్. అందులో కొత్తవాళ్ళతో రెండు పార్టులుగా తీసి సామాన్యుడి పోరాటం అంతా చూపించడం ఒక ఛాలెంజ్.

నిర్మాత రవీందర్ రెడ్డి గారి సపోర్ట్ ఎలా వుంది ?
కొత్త వాళ్లతో ఇంత భారీ బడ్జెట్ రెండు పార్టులు గా సినిమా చేయడం దర్శకుడిగా నాకు ఒక ఛాలెంజ్. ఇంత ఖర్చు చేస్తున్నారు కాబట్టి తను ఇంకా బాగా చేయాలనేది విరాట్ కి ఒక ఛాలెంజ్. ఇన్ని సవాళ్ళ మధ్య సినిమా అంత సజావుగా హాప్పీగా సాగిందంటే కారణం.. నిర్మాత రవీందర్ రెడ్డి గారు. ఎక్కడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా చేశారు. అలాగే ఈ సినిమాకి పని చేసిన కెమరామెన్ చోటా కె నాయుడు గారు మిగతా టెక్నిషియన్స్ నటీనటులు చాలా సహకరించారు. కథ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుందని అన్నారు. అలా ఈ కథే కావాల్సిన అందరినీ సెలెక్ట్ చేసుకుంది.

బయటవారి సినిమాల్లో నటుడిగా చేస్తారా ?
పెదకాపులో చేసిన పాత్ర నాకు బాగా అనిపించింది. బాగా అనిపించేసరికి ఇంకాఎక్కువ సేపు కనిపించాలనే కోరిక వస్తుంది ( నవ్వుతూ). అయితే డైరెక్షన్ వుంది. ఒకవేళ అన్నీ కుదిరి మనం చేస్తే బావుటుందనేలా ఏదైనా వస్తే అప్పుడు చూద్దాం.

ఇదే జోనర్ లో కొనసాగుతారా ?
లేదండీ. నాకు ఫ్యామిలీ జోనర్ చేయడం చాలా ఇష్టం. సమాజంలో అత్యంత ముఖ్యమైన విషయం కుటుంబం. మనం కుటుంబం గురించే ఆలోచిస్తాం. అందులోని ఘర్షణలు, మానసిక యుద్ధాలు అందంగా ఆహ్లాదంగా చూపించడం నాకు చాలా ఇష్టం. వీటితో పాటు సమయానికి తగ్గట్టు మిగతా జోనర్స్ కథలు కూడా చేయాలని వుంది.

నెక్స్ట్ ప్రాజెక్ట్ ?
గీతా ఆర్ట్స్ లో వుంటుంది

Also Read:పిక్ టాక్ : పద్దతిగా పరువాల జాతర !

- Advertisement -