నర్సరీలకు అటవీ శాఖ సాంకేతిక సహకారం –

308
pccf
- Advertisement -

ప్రతీ అటవీ అధికారి, సిబ్బంది తమ పరిధిలోని గ్రామ పంచాయితీ, మున్సిపల్ నర్సరీలను పక్షం రోజులకు ఒక సారి సందర్శించాలని, స్థానిక సర్పంచ్ లేదా కార్యదర్శిని కలిసి రికార్డు పుస్తకాల్లో నమోదు చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ ఆదేశించారు. ఆరవ విడత తెలంగాణకు హరితహారం ఏర్పాట్లు, నర్సరీలు, వన్యప్రాణి సంరక్షణ తదితర అంశాలపై అన్ని జిల్లాల అటవీ అధికారులతో పీసీసీఎఫ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వచ్చే హరితహారం నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, సాంకేతిక సహకారం అందించే బాధ్యత అటవీ శాఖదేనని స్పష్టం చేశారు. నర్సరీల్లో మొక్కలను తనిఖీ చేసి, రకాలు, ఎత్తును బట్టి గ్రేడింగ్ చేసేలా చూడాలన్నారు. గుంతల తవ్వకం, మట్టి స్వభావానికి తగిన మొక్కలు నాటే విధానంపై స్థానిక పంచాయితీ సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. నాటిన మొక్కల నిర్వహణ పంచాయితీలు చేసినా, ప్రతీ పక్షం రోజులకు ఒక సారి ఆ మొక్కలను, నర్సరీలను అటవీ సిబ్బంది పర్యవేక్షించాలని, తప్పనిసరిగా స్థానిక సర్పంచ్ లేదా పంచాయితీ కార్యదర్శిని కలిసి, రికార్డుల్లో నమోదు చేయాలన్నారు.

క్షేత్ర స్థాయి పర్యటన వివరాలు నోట్ కామ్ యాప్ ద్వారా ఫోటోలు తీసి పంపాలన్నారు. ఈ విషయంలో ఎలాంటి అలక్ష్యాన్ని సహించమని హెచ్చరించారు. కొన్ని జిల్లాల్లో గ్రామాల సర్పంచ్ లకు నేరుగా ఫోన్ చేసిన పీసీసీఎఫ్, అటవీ సిబ్బంది వచ్చారా లేదా అని ఆరా తీశారు. జూన్ మొదటి వారంలో జరిగే పల్లెప్రగతిలో పాల్గొంటూ, ఐదున జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ అవగాహన కల్పించాలన్నారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది, ఆవశ్యకతను ఈసారి వివరించాలన్నారు. ఇంకా సమావేశంలో కంపా నిధులతో చేపట్టిన పనులు, అటవీ ప్రాంతాల్లో నీటి కుంటల ఏర్పాటు, వర్షపు నీటి ఇంకుడు గుంతలు, మిడతల దండు సందర్భంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు.

వన్యప్రాణుల రెస్క్యూలో ఖచ్చితమైన ప్రోటోకాల్ పాటించాలి

లాక్ డౌన్ తో పాటు, తీవ్రమైన వేసవి ప్రభావంతో అటవీ జంతువుల సంచారం జనావాసాల్లో పెరిగిందని పీసీసీఎఫ్ తెలిపారు. వన్యప్రాణులను కాపాడే సమయంలో కచ్చితంగా వైల్డ్ లైఫ్ ప్రోటోకాల్ పాటించాలని స్పష్టంచేశారు. జంతువులకు హాని జరగకుండా, సిబ్బంది, ప్రజల రక్షణకు ఇబ్బంది లేకుండా ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. అన్ని వన్యప్రాణి డివిజన్లలో ప్రోటోకాల్ ను పాటిస్తూ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు.

2018 బ్యాచ్ నుంచి తెలంగాణకు కేటాయించిన నలుగురు యువ ఐ.ఎఫ్.ఎస్ లు వృత్తి శిక్షణలో భాగంగా విధుల్లో చేరారు. 16 వారాల పాటు వారు క్షేత్ర స్థాయి శిక్షణ పొందుతారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు పీసీసీఎఫ్ లు లోకేష్ జైస్వాల్, ఆర్.ఎం.డోబ్రియల్, స్వర్గం శ్రీనివాస్, ఎం.సి. పర్గెయిన్, హైదరాబాద్, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్లు చంద్రశేఖర రెడ్డి, సునీతా భగవత్, అన్ని జిల్లాల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -