ఇక నుంచి పెట్రోల్ ధరలు రోజూ మారనున్నాయి. జూన్ 16 నుంచి దేశం మొత్తం ఈ విధానాన్ని అమలు చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్ణయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 రోజులకోసారి పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తున్నాయి. మే 1 నుంచి ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏపీలోని విశాఖపట్టణం, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్, పంజాబ్-హర్యానా ఉమ్మడి రాజధాని ఛండీగఢ్, జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్, పుదుచ్చేరిలో ఈ ప్రయోగం విజయవంతమైనందున దీనిని దేశవ్యాప్తంగా విస్తరించాలని కేంద్ర భావిస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా రోజువారీ ఇంధన ధరల సవరణ విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల బాటలోనే ఎస్సార్ ఆయిల్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌లు కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నాయి. ఇప్పటికీ దేశంలోని చాలా పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ వ్యవస్థలు లేనందునా తమ లాభాలపై ప్రభావం పడుతుందని యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.