ఒక్కటైన ‘పవార్’ పరివార్!

6
- Advertisement -

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండేళ్ల క్రితం విభేదాల కారణంగా విడిపోయిన పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ మరియు ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ రాజకీయంగా కలిసిపోయారు. త్వరలో జరగనున్న పింప్రి–చించ్‌వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్‌సీపీ (ఎస్పీ) – ఎన్‌సీపీ కలిసి పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ విషయాన్ని అజిత్ పవార్ స్వయంగా వెల్లడించారు. “పవార్ పరివార్ మళ్లీ కలిసింది” అంటూ ఆయన కీలక ప్రకటన చేశారు. జనవరి 15న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలూ సంయుక్తంగా పోటీ చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోందని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని చెప్పారు. పార్టీ శ్రేణులు అంతా విభేదాలను పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంపై పూర్తిగా దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటవడం మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది. ఇది రాష్ట్ర రాజకీయ సమీకరణలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఐక్యత కీలకంగా మారనుందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవలే ఠాక్రే సోదరులు కూడా ఏకమయ్యారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మరియు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ఒకే వేదికపై కనిపించారు. వచ్చే నెలలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు వారు ప్రకటించారు.

ఇప్పుడు పవార్ కుటుంబం కూడా రాజకీయంగా ఒక్కటవడంతో మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. రాజకీయ కూటములు, వ్యూహాలతో రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.

Also Read:KTR:ఫిరాయింపు ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్

- Advertisement -