జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్… తెలంగాణ జనసేన నేతలతో భేటీ కానున్నారు. జూన్ 2వ తేదీన తెలంగాణ జనసేన ముఖ్య నాయకులు, పదాధికారులతో పవన్ కళ్యాణ్ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.
తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, మారుతున్న సమీకరణాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడం, తెలంగాణలో జనసేన క్యాడర్‌ను యాక్టివ్ చేయడంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా సమస్యలపై పోరాటాల గురించి తెలంగాణ నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలతో పాటు భవిష్యత్తులో రాబోయే ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని జనసేన అధినేత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో పార్టీకి ఉన్న బలమైన క్యాడర్, యువత మద్దతును ఓట్ల రూపంలోకి మార్చుకునేలా పటిష్టమైన కార్యాచరణను రూపొందిస్తున్నారు.
గత కొంతకాలంగా తెలంగాణలో సైలెంట్‌గా ఉన్న జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో ఒక్కసారిగా ఉత్సాహంలో మునిగిపోయాయి.
Also Read:వెనక్కి తగ్గిన ‘పెద్ది’ నిర్మాతలు!

